దేశంలో అధిక విలువైన కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మను తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందనపుర్. బార్లు, అవినీతి వ్యవహారాల్లో రూ.2,000, రూ.500 నోట్లను ఎక్కువగా వాడుతున్నందున ఈ నోట్లపై గాంధీ బొమ్మను తొలగించాలని కోరారు. గాంధీ చిత్రాన్ని తొలగించి.. ఆయన ఐకానిక్ కళ్లజోడు బొమ్మతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని అభ్యర్థించారు.
అయితే నిరుపేదలు విరివిరిగా ఉపయోగించే రూ.5, రూ.10, రూ.20, రూ.50. రూ.100, రూ.200 నోట్లపై మాత్రం ఆ బొమ్మను అలాగే ఉంచాలని.. మహాత్మా గాంధీ జీవితాంతం వారి కోసమే పని చేశారని లేఖలో పేర్కొన్నారు భరత్ సింగ్.
"రూ.2000, రూ.500 నోట్లపై గాంధీ కళ్లజోడు అచ్చువేయాలి. అశోక చక్రం కూడా ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. మహాత్మా గాంధీ చిత్రం సత్యాన్ని సూచిస్తుంది. గాంధీ చిత్రాన్ని రూ.500 ,రూ.2,000 నోట్లపై ముద్రించారు. వీటిని సాధారణంగా అవినీతి, లంచాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, బార్లలో ఉపయోగిస్తున్నారు. ఇది గాంధీకి చెడ్డపేరు తెస్తుంది. అందుకే పేదలు ఉపయోగించే చిన్న నోట్లపైన గాంధీ బొమ్మను ఉంచి.. అధిక విలువైన నోట్లపై తొలగించాలన్నది నా విజ్ఞప్తి."
- భరత్ సింగ్ కుందనపుర్, రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
దేశంలో వెలుగుచూస్తున్న అవినీతి కేసుల విషయంలో అందరి దృష్టిని ఆకర్షించడానికే రాజస్థాన్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. 2019 జనవరి నుంచి 2020 డిసెంబరు 31 మధ్య కాలంలో మొత్తం 616 అవినీతి కేసులు నమోదయ్యాయని.. సగటున రోజుకు రెండు కేసులు వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు