Tomato price altime Record: అనంతపురం టమాటా మార్కెట్ లో రైతులకు రికార్డు స్థాయి ధరలు లభించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 15 కిలోల టమeటా పెట్టె ధర 3200 రూపాయలు పలికింది. ఏటా వర్షాభావంతోనో, అకాల వర్షాలతో, మార్కెట్లో ధరలు పతనమై నష్టపోతున్న రైతులు ఈసారి రికార్డు స్థాయి ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వారి ఊహించిన ధరకంటే 40 శాతం వరకు అధికంగా వస్తుండటం అన్నదాత ఆనందానికి అవధులులేకుండా పోయింది. అనంతపురం టమాటా మండీలో నాణ్యతలేని టమాటా 15 కిలోల బాక్సు కనిష్టంగా 1600 ధర పలకగా, గరిష్టంగా 3200 రూపాయలతో రికార్డు నమోదైంది.
టమాటా లేకుండా రుచి ఎలా.. ఏ వంటకంలోనైనా టమాటా లేకుండా రుచి ఉండదని అందరికీ తెలిసిన విషయం. నిత్యావసర కూరగాయల్లో టమాటా అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ పంట సాగుచేసిన రైతులు ఏటా ఏదోరకంగా నష్టపోతూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో కోత కూలీలు కూడా రాక కిలో పావలా, అర్ధరూపాయికి విక్రయాలు జరిగిన రైతు దయనీయ పరిస్థితిని చూశాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట సాగు ఆలస్యం కావటంతో, అప్పటికే బోర్ల కింద సాగుచేసిన టమాటా రైతులకు మంచి ధరలు దక్కాయి. రాష్ట్రంలో పండించిన టమాటాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు, పేరు ఉంది. రాయలసీమలో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో టమాటాను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. ఈసారి మే నెల నుంచి టమాటా ఉత్పత్తి తగ్గిపోవటంతో ధరలు పెరగటం ప్రారంభమైంది. జూన్, జూలై నెలల్లో వచ్చిన ధరలే రికార్డు స్థాయి ధరలని మార్కెట్ వర్గాలు భావించిన తరుణంలో మంగళవారం అనంతపురం మండీలో 15 కిలోల టమాటా పెట్టె ధర 3200 రూపాయలు పలికింది. ఇంత ధర వస్తుందని ఊహించలేదని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
రాష్ట్రంలో కూరగాయల సాగు విషయంలో ప్రభుత్వం రైతులకు ప్రణాళిక అమలు చేయకపోవటంతో వస్తే మంచి ధరలు, లేకుంటే కోత కూలీలు కూడా రాక రోడ్డు పక్కన పారబోసి పోయే పరిస్థితి ఎదురవుతోంది. దేశంలో కూరగాయల మార్కెట్‌ను, ఆయా రాష్ట్రాల్లో పంట సాగు కాలాన్ని, దిగుబడి సమయాన్ని అంచనావేసి రాష్ట్రంలో రైతులతో సాగు చేయిస్తే ఏటా మంచి ధరలు దక్కే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా రైతులకు ఈ తరహాలో ఎలాంటి ప్రణాళిక ఇవ్వటం లేదు. దీంతో అటు రైతులు నష్టపోవటమో, వినియోగదారులకు ధర భారం కావటమో చూస్తూనే ఉన్నాం. రాయలసీమ జిల్లాలో వర్షాధారంగా పెద్దఎత్తున టమాటా సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు ఎదురు కావటంతో సకాలంలో వర్షం కురుస్తుందో లేదోనని రైతులు ధైర్యంగా టమాటా నాటలేకపోయారు. విస్తీర్ణం తగ్గటంతో మార్కెట్ లో టమాటా నిల్వలు తగ్గి అమాంతం ధరలు పెరగటం మొదలైంది. ఇలా మే నుంచి పెరుగుతూ వచ్చిన టమాటా ధరలు గరిష్ట స్థాయిలోకి వెళ్లాయి.. ఈ ధరలు మరో నెల రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ లో వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశమంతటా లోటు వర్షపాతం కొనసాగుతుండటంతో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఉల్లి ధరలు పెరుగుతాయనే వదంతులతో వినియోగదారులు ఉల్లి కొనుగోలుకు ఎగబడి ఇంట్లో నిల్వచేసుకుంటున్నారు.