Rahul Gandhi rally in Dehradun: ఉత్తరాఖండ్‌లోని చాలా కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం సైతం దేశం కోసం త్యాగాలు చేసిందని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇదే ఆ రాష్ట్రంతో తనకు ఉన్న సంబంధమని తెలిపారు. 1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దెహ్రాదూన్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు రాహుల్.
1971లో జరిగిన యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే పాకిస్థాన్.. భారత్ ముందు తలవంచిందని తెలిపారు రాహుల్. సాధారణంగా యుద్ధం అంటే 6 నెలలు, 1-2 ఏళ్లు పడుతుందన్నారు. అఫ్గానిస్థాన్‌ను ఓడించేందుకు అమెరికాకు 20 ఏళ్లు పట్టిందని, కానీ, యావత్ భారత్ ఒక్కటిగా నిలిచి.. 13 రోజుల్లోనే పాకిస్థాన్‌ను మట్టి కరిపించిందని గుర్తు చేసుకున్నారు.
" బంగ్లాదేశ్ యుద్ధంపై దిల్లీలో ఈరోజు ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో ఇందిరా గాంధీ గురించి ఎక్కడా చెప్పలేదు. ఆమె ఈ దేశం కోసం 32 తూటాలకు ఎదురొడ్డి నిలిచారు. నిజాలకు భయపడే ఆమెను విస్మరించారు. ఉత్తరాఖండ్‌లోని చాలా కుటుంబాల మాదిరిగానే నా కుటుంబం సైతం త్యాగాలు చేసింది. అదే ఈ రాష్ట్రంతో నాకు ఉన్న సంబంధం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
రాహుల్ సభలో రావత్ కటౌట్..
దెహ్రాదూన్‌లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సభలో సీడీఎస్ రావత్ భారీ కటౌట్ కనిపించింది. ఓ వైపు ఇందిరా గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీ మధ్యలో రావత్ కటౌట్ ఏర్పాటు చేశారు. భారత తొలి త్రిదళాధిపతి బిపిన్ రావత్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆరోపణలు చేశారు. తాజాగా కాంగ్రెస్ సభలో రావత్ కటౌట్ కనిపించటం వల్ల.. సీఎం ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.
ఇదీ చూడండి: జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు ప్రధాని నివాళి