పట్టణ ప్రాంత ప్రజలకు చెత్త నుంచి విముక్తితో పాటు తాగునీటి భద్రత కల్పించే రెండో దశ స్వచ్ఛ భారత్ (పట్టణ)(Swachh Bharat mission urban), అమృత్ కార్యక్రమాలు(AMRUT) శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రూ.4.28 లక్షల కోట్ల వ్యయ అంచనాతో చేపడుతున్న ఈ పనులకు ప్రధాని మోదీ(Modi News) శ్రీకారం చుట్టనున్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవడం, 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం వీటిని రూపొందించింది. స్వచ్ఛ భారత్ (పట్టణ) కింద పట్టణాలకు మురుగు నుంచి విముక్తి కల్పిస్తారు. అమృత్ పథకం పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో మురికి నీటి నిర్వహణ చేపడతారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ ప్లస్ (బహిరంగ మల విసర్జన రహితం)గా మారుస్తారు. లక్ష జనాభాకు పైబడిన పట్టణాలను ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్‌గా తీర్చిదిద్దుతారు. తద్వారా పట్టణాలు స్వచ్ఛమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఘన వ్యర్థాలను అవి ఉత్పత్తి అయ్యేచోటే వేరు చేయడంపై దృష్టి సారిస్తారు. వాటిని తగ్గించడం, పునర్వినియోగించడం, పునఃశుద్ధి చేయడం గురించి ఆలోచిస్తారు. మున్సిపాల్టీల్లో వెలువడే అన్నిరకాల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధిచేసి, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తారు. ఈ స్వచ్ఛభారత్-2.0కి కేంద్ర ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.
అమృత్ 2.0..
ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. 500 అమృత్ పట్టణాల్లో ఇళ్లకు మరుగు వ్యర్థాల కనెక్షన్లు ఇస్తారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్న 10.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఉపరితల, భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్య కల్పన పురోగతిని తెలుసుకొనేందుకు తాగునీటి సర్వేకూడా చేపడతారు. ఈ మొత్తం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.87 లక్షల కోట్లు కేటాయించింది.
ఇప్పటివరకు వచ్చిన ఫలితం ఏంటి?
స్వచ్ఛభారత్ మిషన్(Swachh Bharat mission urban), అమృత్ పథకాల(AMRUT Scheme) అమలు వల్ల గత ఏడేళ్లలో పట్టణ ప్రాంతాల ముఖచిత్రం బాగా మారిందని, ప్రజలకు పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా సదుపాయాలు మెరుగుపడ్డాయని పీఎంఓ పేర్కొంది. అన్ని పట్టణాలను ఓడీఎఫ్ ఫ్రీగా ప్రకటించగలిగామని, 70 శాతం ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధిచేయగలుగుతున్నామని తెలిపింది. అమృత్ పథకం కింద ఇప్పటి వరకు అందించిన 1.1 కోట్ల నల్లా, 85 లక్షల మురుగు నీటి కనెక్షన్ల వల్ల దాదాపు 4 కోట్ల మందికిపైగా ప్రయోజనం పొందినట్లు వెల్లడించింది.