PM Modi Speech on Independence Day : లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈసారి పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు.. దేశ యువతకు సహాయకారిగా ఉంటున్నాయని వివరించారు. కేంద్ర పథకాలకు యువశక్తి తోడై.. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించిందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అగ్రిటెక్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ.. స్వయం సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులను చేసేందుకు లాఖ్‌పతి-దీదీ పథకం తేనున్నట్లు ప్రకటించారు.
"గ్రామాల్లో 2 కోట్ల మంది మహిళా లక్షలాధికారులను తయారు చేయడమే నా కల. భారత వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం రావాలి. అగ్రిటెక్ బలోపేతమవ్వాలి. ఇందుకోసం స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలకు మేము శిక్షణ ఇస్తాం. డ్రోన్ నడపడానికి, డ్రోన్లను మరమ్మత్తు చేయడానికి మేము శిక్షణ ఇస్తాం. వేలాదిగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలకు భారత ప్రభుత్వం డ్రోన్లను సమకూరుస్తుంది. శిక్షణ ఇస్తుంది. మన వ్యవసాయ రంగంలో డ్రోన్ల సేవలు అందుబాటులో ఉండేలా చేస్తాం. ఇందుకోసం 15 వేల స్వయం సహాయక బృందాల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభిస్తాం."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఎర్రకోట సాక్షిగా మరో రెండు పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి.. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటికల సాకారమే లక్ష్యంగా తీసుకువస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం.. విశ్వకర్మ యోజనను వచ్చే నెల నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
"నా పాలనలో కేవలం ఐదేళ్ల వ్యవధిలో 13.5 కోట్ల మంది పేదరికం సంకెళ్లను తెంచుకుని కొత్తగా మధ్యతరగతిలో ప్రవేశించారు. జీవితంలో ఇంతకంటే మించిన సంతోషం ఉండదు. ఈసారి విశ్వకర్మ జయంతినాడు 13 నుంచి 15 వేల కోట్ల రూపాయలతో తరతరాలుగా చేతి వృత్తులు చేసుకుని జీవిస్తున్న కార్మికులు, స్వర్ణకారులు, బట్టలు ఉతికేవారు, జుత్తు కత్తిరించేవారు, ఇలాంటి వారికి చేయూతను ఇచ్చేందుకు రానున్న నెలలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని విశ్వకర్మ పథకాన్ని తీసుకొస్తున్నాం. ఆరంభంలో దీనికి 13 నుంచి 15 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
25వేలకు జన్ ఔషధి కేంద్రాల పెంపు..
కొవిడ్ తర్వాత భారత్ ప్రపంచ దేశాలకు విశ్వమిత్రగా మారిందన్న మోదీ.. వన్ ఎర్త్, వన్ హెల్త్ విధానాన్ని ప్రోత్సహించినట్లు గుర్తుచేశారు. పేద ప్రజలకు చౌకగా ఔషధాలను అందిస్తున్న జన ఔషధి కేంద్రాలను పది వేల నుంచి 25 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలు ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి వారికి నూతన శక్తిని అందిస్తాయని ఆయన వెల్లడించారు. మధుమేహంతో బాధపడే రోగులకు నెలకు రూ.3వేలు ఖర్చు అవుతోందని.. కానీ జన్ ఔషధి కేంద్రాలలో అవి 100 రూపాయలలోనే లభిస్తాయని మోదీ తెలిపారు.
"ఏ శక్తికీ భారత్ భయపడదు.. తలవంచదు. దేశం స్వయంసమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోంది. ఏ యుద్ధానికైనా మన సైన్యం సర్వ సన్నద్ధంగా ఉంది. కొత్త చేతనతో మన సైన్యం ముందడుగు వేస్తోంది. దేశం వేస్తున్న ప్రతి ముందడుగు మనందరి బలం, బాధ్యత. వైవిధ్యంలో ఏకత్వాన్ని మరింత బలోపేతం చేసేలా కొత్త అడుగులు పడుతున్నాయి. నా కొత్త భాష, కొత్త ఆలోచనలు దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయి."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
2047 స్వతంత్ర శతజయంతి నాటికి అభివృద్ధి చెందిన భారతం ఆవిష్కృతం కావాలని ప్రధాని ఆకాక్షించారు. యావత్ జాతి సంపూర్ణ సంకల్పంతోనే ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు. 75 ఏళ్లలో గొప్ప అభివృద్ధిని సాధించామని.. ఇది ద్విగుణీకృతం కావాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటాయని.. వాటికి పరిష్కారాలు చూపడమే మన బాధ్యతని గుర్తు చేశారు. కలలు నిజం కావాలంటే దృఢసంకల్పంతో పనిచేయాలని సూచించారు.
77th independence day 2023 : ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ.. వరుసగా పదోసారి..
'శాంతితోనే మణిపుర్ సమస్యకు పరిష్కారం.. ప్రస్తుతం అక్కడ మెరుగైన పరిస్థితులు'.. ఎర్రకోటపై మోదీ