అనారోగ్యంతో బుధవారం ఆస్పత్రిలో చేరిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కోలుకుంటున్నారు. ప్రధాని సోదరుడు సోమాభాయ్ గురువారం ఈ విషయం వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె.. ద్రవాహారం స్వీకరిస్తున్నారని తెలిపారు.
" ఆమె పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. ఆమె చేతులు, కాళ్లు కదిలించారు. ద్రవాహారాలను తీసుకున్నారు."
-సోమాభాయ్ మోదీ
తనను కూర్చోపెట్టమని ఆమె సంజ్ఞల ద్వారా అడిగారని, అలాగే ద్రవాలను ఆహారంగా తీసుకున్నారని సోమాభాయ్ తెలిపారు. సీటీ స్కాన్, ఎమ్ఆర్ఐ స్కాన్ తర్వాత ఆమె డిశ్చార్జ్ గురించి వైద్యులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
"ప్రధాని తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె త్వరగా కోలుకుంటున్నారు. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం" అని ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బుధవారమే హుటాహుటిన దిల్లీ నుంచి గుజరాత్ వెళ్లారు మోదీ. గంటకు పైగా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రిలోని వైద్యులతో తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రార్థిస్తున్నట్లు పలువురు నాయకులు ట్వీట్లు చేశారు.
ఇవీ చదవండి:
దగ్గు మందుకు 18 మంది పిల్లలు బలి!.. భారత్‌లో ఔషధం ఉత్పత్తి బంద్.. దర్యాప్తు ముమ్మరం
కోలుకున్న నిర్మలా సీతారామన్.. దిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్