స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలు విలువైన సూచనలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగంలో వాటిని భాగం చేయనున్నట్లు శుక్రవారం ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు పీఎంఓ ట్వీట్ చేసింది.
"మీ ఆలోచనలు ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రతిధ్వనిస్తాయి. ఆగస్టు 15న ప్రధాని నరంద్ర మోదీ ప్రసంగం కోసం మీరు ఏ సూచనలు ఇస్తారు? వాటిని mygovindiaలో పంచుకోండి" అని పీఎంఓ ట్వీట్ చేసింది. ఎర్రకోట, ప్రధాని మోదీ ఉన్న చిత్రాన్ని దానిలో పొందుపర్చింది.
ప్రధాని తన ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలను వివరిస్తారని mygov పోర్టల్ పేర్కొంది. ఎప్పటిలాగే ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవాలని ఆహ్వానించింది. ఈ పోర్టల్ ప్రభుత్వం, పౌరులను భాగస్వామ్యం చేసే వినూత్న వేదిక.
పెట్రో ధరలపై మాట్లాడండి..
ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసిన కొన్ని క్షణాలకే ప్రజల నుంచి సందేశాల వెల్లువ వచ్చింది. పెట్రో ధరలు, రఫేల్, పెగసస్‌పై మోదీ మాట్లాడాలని ఎక్కువ అభ్యర్థనలు వచ్చాయి.
ఇదీ చూడండి: 'ప్రజాభాగస్వామ్య పాలనకు 'మై గవ్' గొప్ప ఉదాహరణ'