కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉద్యోగాల జాతర మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. ఏడాదిన్నరలో భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువులను భర్తీ చేసేందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఏకంగా 10లక్షల ఉద్యోగాల నియామకాలను చేపట్టాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేయడం.. త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువత కోసం కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు మిన్నంటుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల స్థితిగతులను మంగళవారం ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ క్రమంలో అన్ని విధాల పరిశీలించిన ప్రధాని మోదీ.. ఎవరూ ఊహించని విధంగా.. ఏకంగా 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏడాదిన్నరలో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది.
మోదీ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యాగాల భర్తీ ఆశించిన రీతిలో జరగలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోవైపు రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఏడాదిన్నరలోనే పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎన్డీఏ సర్కారు భావించడం.. రాజకీయ వ్యూహంలోని భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సైనిక దళాల నియామకాలు 10లక్షల్లో భాగమేనా?
భారతీయ సైనిక దళాల నియామకాల్లో విప్లవాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 'అగ్నిపథ్' పేరుతో షార్ట్ సర్వీస్ విధానాన్ని ప్రకటించింది. భారతీయ సైనిక దళాలను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. షార్ట్ సర్వీస్ పద్ధతి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, భారతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభిస్తారని మోదీ సర్కారు అభిప్రాయపడుతోంది.
కొత్త విధానం ద్వారా నియామకాల కోసం టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టనున్నారు. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రతి బ్యాచ్‌లో 45వేల మందిని తీసుకోనున్నారు. పది లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగానే సైనిక నియామకాలు చేపడతారా? లేక విడిగా.. దళాల నియామకం ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
'అగ్నిపథ్' నియామకం.. ఉద్యోగం ఇలా..
- త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
- కొత్త విధానం వల్ల భారత సైనిక దళాల్లో ఎక్కువ భాగం యువత ఉండే అవకాశం ఉంటుంది.
- అగ్నిపథ్ విధానం కింద త్రివిధ దళాల్లో నియామకాలను షార్ట్‌టర్మ్, ఒప్పంద ప్రాతిపదికన చేపడతారు.
- 'అగ్నిపథ్' విధానం ద్వారా నియామకమైన వారి సర్వీసు నాలుగేళ్లు ఉంటుంది.
- 90 రోజుల్లో తొలి బ్యాచ్ నియామకం చేపట్టనున్నారు. అందులో దాదాపు 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
- 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంపికైన వారికి ఆరునెలలు శిక్షణ ఇస్తారు. మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు.
- అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు ఇస్తారు.
- సర్వీసు కాలంలో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వేతనం, ఇతర ఇతర సదుపాయాలు అందిస్తారు.
- సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు లభిస్తాయి.
- పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని సేవా నిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తన వంతు జమచేస్తుంది.
- నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఏక మొత్తంగా రూ. 11.71 లక్షల నిధి(పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తుంది. దీంతో పాటు సర్వీసులో రూ.48లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది.
నాలుగేళ్లు పూర్తయ్యాక ఏం చేయాలంటే?
- నాలుగేళ్ల ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక.. ప్రతిభ చూపిన వారిలో 25 శాతం మందికి.. మెరుగైన ప్యాకేజీతో పాటు.. శాశ్వత కమిషన్‌లో అవకాశం దక్కుతుంది.
- నాలుగేళ్ల సర్వీసు పూర్తైన వారు.. స్వచ్ఛందంగా కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.
- ఎంపికలు ఆటోమేటెడ్ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.
- శాశ్వత కమిషన్‌కు ఎంపిక కాని వారు.. పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు ఉంటాయి.
- నాలుగేళ్ల సర్వీసు తర్వాత అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.
'అగ్నిపథ్' విధానం ఎందుకు తీసుకొచ్చారు?
త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ అగ్నిపథ్ సర్వీసును కేంద్రం తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రక్షణ రంగ బడ్జెట్ రూ.5 లక్షల 25వేల 166కోట్లు. అందులో పెన్షన్ల వాటా రూ.లక్షా 19వేల 696 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 33వేల కోట్లుగా ఉంది. రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో దాదాపు సగానికి పైగా వేతనాలు, పింఛన్లకే సరిపోతోంది. అయితే అగ్నిపథ్‌లో చేరి నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత.. వారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది. మిగులు నిధులతో త్రివిధ దళాల ఆధునికీకరణకు వెసులుబాటు లభించనుంది.
"సాయుధ దళాలను అధునికీకరించి, అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం యువతను సైన్యంలో భాగం చేసుకోవాలి. అందుకోసం కొత్త విధానం ఉపయోగపడుతుంది"
-లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ
16కోట్ల ఉద్యోగాలకు బదులు.. 10లక్షలా? : కాంగ్రెస్
10లక్షల ఉద్యోగాల ప్రకటనపై మోదీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఇంకా ఎంతకాలం ఈ మాటల గారడీ అని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఎద్దేవా చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని మండిపడ్డారు. ఆ లెక్క ప్రకారం ఇప్పటికి వరకు దేశంలో 16కోట్ల ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. 2024 నాటికి 10లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ప్రస్తుతం అరవై లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్ర శాఖల వద్దే ఉన్నాయని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: సెకండ్ డే, సెకండ్ రౌండ్.. రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం!