పంజాబ్ గురుదాస్‌పుర్‌లో ఒకే కుక్క.. ఐదు గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దినానగర్ సమీపంలోని ఐదు గ్రామాల్లోని 12 మందిపై ఆ పెంపుడు శునకం దాడి చేసింది. గ్రామాల మధ్య కిలోమీటర్ల దూరం ఉన్నా.. శునకం వదిలిపెట్టలేదు. మధ్యలో జాతీయ రహదారి ఉందని, దాన్ని సైతం దాటుకొని వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. శునకం మొదట.. తంగోషా గ్రామంలోని ఇద్దరు కూలీలపై దాడి చేసింది. చాకచక్యంగా వ్యవహరించిన కూలీలు.. పెంపుడు శునకం మెడకు ఉన్న చైన్‌ను పట్టుకొని దాన్ని అడ్డుకోగలిగారు. ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకున్న కుక్క.. రాత్రి వేళ గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ దిలీప్ కుమార్(60) అనే వ్యక్తిపై దాడి చేసింది.
ఈ సమయంలో ఓ వీధి కుక్క.. ఆ శునకంపైకి వచ్చింది. దీంతో దిలీప్ కుమార్ తప్పించుకున్నాడు. ఇంటివైపు పరిగెత్తాడు. అయితే, పెంపుడు శునకం వదల్లేదు. దిలీప్‌ను వెంబడించింది. తలపై కాళ్లతో గీరింది. ఇంటివరకు చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు కాపాడారు. అనంతరం గ్రామానికి చెందిన బల్దేవ్ రాజ్‌పై దాడి చేసింది. అనంతరం ఘరోటా రోడ్ వైపు వెళ్లిన శునకం.. దారిలో అనేక జంతువులపైనా దాడికి దిగింది.
ఈ క్రమంలోనే నేపాలీ వాచ్‌మన్ రామ్‌నాథ్, ఛన్నీ గ్రామానికి చెందిన మంగల్ సింగ్‌పైనా దాడి చేసింది. ఆ తర్వాత చౌహానా గ్రామానికి చెందిన విశ్రాంత సైనికుడు కెప్టెన్ శక్తి సింగ్‌ను కరిచేసింది. ఆయన చెయ్యికి తీవ్ర గాయమైంది. అయితే, ధైర్యం కోల్పోకుండా శునకాన్ని పట్టుకునేందుకు శక్తిసింగ్ ప్రయత్నించారు. దాని రెండు చెవులను పట్టుకొని నిలువరించే ప్రయత్నం చేశారు. శక్తిసింగ్ అరుపులు విని మరికొందరు అక్కడికి చేరుకున్నారు. కర్రలతో శునకాన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో అది ప్రాణాలు కోల్పోయింది. శునకం ధాటికి గాయపడ్డవారంతా దినానగర్, గురుదాస్‌పుర్ సివిల్ ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు.
పాదచారులపై దొంగల దాడి..
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో గుర్తుతెలియని వ్యక్తులు ఆరుగురిని లూటీ చేశారు. మోహన్‌లాల్ గంజ్‌లో ఈ ఘటన జరిగింది. దుండగులు పోలీసులపైనా దాడి చేశారు. ఓ చెట్టు వెనక దాక్కున్న దొంగలు.. దారిలో వెళ్తున్న ఆరుగురిపై లాఠీలతో దాడి చేశారని, అనంతరం వారి వస్తువులను దొంగలించారని పోలీసులు తెలిపారు. బాధితులంతా తమ ఇంటికి వెళ్తుండగా ఈ లూటీ జరిగిందని చెప్పారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది.
అయితే, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. తమ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించలేదని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు సైతం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేసిన తర్వాతే వారు స్పందించారని సమాచారం. అనంతరం రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ కుల్దీప్ దుబే, ఆయన బృందం.. ఘటనాస్థలికి చేరుకుంది. పోలీసులను గమనించిన దుండగులు.. వారిపైనా రాళ్లు విసిరి ఘటనాస్థలి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.