ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లోని ఓ గ్రామంలో పావురం రక్తపు లేఖతో గ్రామస్థులకు కనిపించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దీనిని ఉర్దూ భాషలో రాశారు. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా భయపడ్డారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు.
పూర్వకాలంలో ఎవరికైనా సందేశం పంపాలంటే దాదాపు లేఖలనే వినియోగించే వాళ్లము. అయితే ఉత్తరాలు రాసి పోస్ట్ డబ్బాల్లో వేయడం కంటే ముందు వీటిని ఇతరులకు చేరవేసేందుకు శాంతికి చిహ్నమైన పావురాలనే వాడేవారు. కాలక్రమేణా ఆధునిక యుగంలో వీటి వాడకం అమాంతం తగ్గిపోయింది.
ఏడు వాక్యాలే.. కానీ ఎవరూ చదవలేదు..
కాన్పుర్‌లోని బిధాను పోలీస్ స్టేషన్ పరిధిలోని కథారా గ్రామంలో గురువారం ఓ పావురం మెడకు ఉత్తరంతో ఎగురుకుంటూ వచ్చింది. ఇందులో ఉర్దూ భాషలో ఏడు లైన్లు రాసి ఉన్నాయి. అంతేగాక దీనికి వెనక భాగంలో కొన్ని రక్తపు మరకలు కూడా ఉన్నాయి. కాగా, ఈ లేఖ ఒక ఇంటి చిరునామాకు చేరబోయి కథారా గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుష్వాహా అనే రైతు ఇంటికి తీసుకువచ్చింది పావురం. గురువారం ఉదయం పక్షులకు దాణా వేయడానికి ఇంటి బయటకు వచ్చిన ఆ రైతు చాలా సమయంగా కూస్తూ ఉన్న ఓ పావురాన్ని గమనించాడు. దగ్గరికి వెళ్లి చూడగా ఆ పావురం మేడకు రక్తపు మరకలతో ఉన్న లేఖ కనిపించింది.
ఈ విషయాన్ని వెంటనే గ్రామస్థులకు చెప్పాడు ధర్మేంద్ర. అనంతరం పావురాన్ని బోనులో బంధించారు. పావురం మెడలోని లేఖను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయి దానిని చదివే ప్రయత్నం చేశారు కథారా గ్రామ ప్రజలు. కాగా, అది ఉర్దూ భాషలో ఉన్నందున ఎవరూ చదవలేకపోయారు. మరోపక్క దీనిని మంత్రతంత్రాలకు ఆపాదిస్తూ భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. వారిలో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఉర్దూ భాషా పండితులను పిలిపించి చదవించే ప్రయత్నం చేస్తున్నామని.. ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభించామని బిధాను పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ యోగేష్ కుమార్ సింగ్ తెలిపారు.
'మారీ' పావురం.. కొంతకాలం క్రితం కాళ్లకు ట్యాగ్‌తో గుర్తుతెలియని పావురం మహబూబాబాద్ జిల్లాలోని ఓ తండాలో కనిపించింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ఈ పావురం చివరకు ఓ ఇంటి మిద్దెపై వాలింది. దీనిని గమనించిన ఓ యువకుడు దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఎగిరిపోయింది. మళ్లీ కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన ఆ పావురాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు అతడు. మరి ఈ యువకుడు పట్టుకున్న పావురం సాదాసీదా జాతికి చెందిన పావురం కాదట.. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.