Tenth Class Student Burnt alive: రాష్ట్రంలో రోజురోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కడో చోట హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, యాసిడ్ దాడి, పెట్రోల్ దాడులు అధికమవుతున్నాయి. మొన్న ఏలూరులో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా బాపట్ల జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి బలైయ్యాడు.
బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్వల్ప వివాదంపై కక్షపెంచుకున్న దుండుగలు దారికాచి అడ్డగించి పదోతరగతి విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అమర్‌నాథ్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చెరుకుపల్లి మండలం రాజోలుకు చెందిన విద్యార్థి అమర్‌నాథ్.. ఉదయం ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో వెంకటర్‌రెడ్డితోపాటు మరో ముగ్గురు యువకులు సైకిల్‌ను అడ్డగించి అమర్‌నాథ్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అమర్‌నాథ్ హాహాకారాలు చేయడంతో సమీపంలో ఉండేవారు వచ్చి చూసి బంధువులకు సమాచారమిచ్చారు. తీవ్రంగా గాయపడిన అమర్‌నాథ్‌ను వెంటనే గుంటూరులోని GGHకు తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
"అమర్నాథ్ సోదరిని మరో వ్యక్తి వేధిస్తున్నాడు. అమర్నాథ్‌కు విషయం తెలిసి ఆ వ్యక్తిని నిలదీశాడు. తన అక్క కళాశాల వద్దకు ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించాడు. 2 నెలల క్రితం అమర్నాథ్‌ను అపహరించి దాడి చేయించాడు. అడ్డుగా ఉన్నాడని భావించి అమర్నాథ్‌ను చంపారు"-రెడ్డయ్య, అమర్నాథ్ తాతయ్య
అమార్‌నాథ్ సోదరిని వెంకటర్‌రెడ్డి అనే యువకుడు వేధిస్తుండటంతో రెండు నెలల క్రితం అమర్‌నాథ్ నిలదీశాడు. దీనిపై కక్షపెంచుకున్న వెంకటర్‌రెడ్డి మరికొందరు యువకులతో కలిసి అమర్‌నాథ్‌పై దాడి చేసి కొట్టాడు. దీనిపై అమర్‌నాథ్ కుటుంబ సభ్యులు వెంకట్‌రెడ్డిని మందలించడంతోపాటు తల్లిదండ్రులకు చెప్పగా.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై మరింత కక్షపెంచుకుని ఇవాళ మళ్లీ దాడి చేసినట్లు అమర్‌నాథ్ తెలిపాడని బంధువులు వివరించారు.
అమర్నాథ్ హత్యపై కేసు నమోదు: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో జరిగిన అమర్నాథ్ (15 ) మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రేపల్లె డీఎస్పీ మురళి కృష్ణ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు నలుగురి పై కేసు నమోదు చేశామన్నారు. మృతుడి అక్కను పాము వెంకటేశ్వరరెడ్డి గత కొంత కాలంగా వేధిస్తున్నాడని తల్లి మాధవి ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. తన అక్కను వేధించడంపై మృతుడు.. వెంకటేశ్వరరెడ్డిని నిలదీయడంతో.. ఉదయం ట్యూషన్‌కు వెళ్లే సమయంలో దాడి చేసి పెట్రోల్ పోసి హత్య చేసినట్లు.. తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. అయితే మృతుడు.. తల్లి, అక్కతో కలిసి ఉప్పలవారి పాలెంలో నివాసం ఉంటున్నారు. తండ్రి చనిపోవడంతో ఇద్దరు పిల్లలను తల్లి మాధవి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తుందని తెలిపారు.