కర్ణాటక శివమొగ్గలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన డాగ్ షోలో ఓ పెంపుడు శునకం హైలైట్గా నిలిచింది. బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ఈ శునకాన్ని.. ఇక్కడికి తీసుకొచ్చారు. దీని ధర వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఒకటి కాదు.. రెండుకాదు.. ఈ పెంపుడు శునకం ఖరీదు అక్షరాల 10 కోట్ల రూపాయలు. ఇది 'టిబెటన్ మస్తఫ్' జాతికి చెందిన శునకమని దాని యజమాని సతీశ్ చెబుతున్నారు. దీనికి భీమా అని పేరు పెట్టుకున్నారు సతీశ్.
ఇంత ఖరీదైన శునకాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు డాగ్ షోకు తరలివస్తున్నారు. శునకంతో సెల్ఫీలు దిగేందుకు పోటెత్తుతున్నారు. ఈ శునకాన్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్నారు సతీశ్. దానికి పసందైన ఆహారాన్ని అందిస్తున్నారు. రోజంతా ఏసీలోనే ఉంచుతున్నారు. 'భీమా' నిర్వహణ కోసమే ప్రతినెలా రూ.25వేలు ఖర్చు చేస్తున్నట్లు సతీశ్ తెలిపారు.
'ఈ శునకాన్ని చైనా నుంచి తీసుకొచ్చాం. రెండున్నరేళ్ల క్రితం దీన్ని తీసుకొచ్చాను. చికెన్ లెగ్పీసులు, ఖరీదైన ఇతర ఆహారాన్ని అందిస్తాం. దీని బరువు వంద కిలోల కంటే ఎక్కువే. రోజుకు ఒక కిలోమీటరు దూరం మాత్రమే నడుస్తుంది. దీనికి రోజంతా ఏసీ అవసరం. రెడీమేడ్ ఆహారం, పచ్చి మాంసాన్ని ఎక్కువగా ఇస్తుంటాం. మొత్తంగా రూ.25 వేలు ఖర్చు అవుతుంది' అని శునకం యజమాని సతీశ్ వివరించారు.