Janasena Party chief Pawan Kalyan comments: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీల పొత్తులపై నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. బలమున్న ప్రధాన పార్టీలతో జనసేన పార్టీ కలిసి నడవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పొత్తులతోనే చాలా పార్టీలు బలపడినాయని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా ఒకప్పుడు పొత్తులు పెట్టుకున్న పార్టీనేనని గుర్తు చేశారు.
40 స్థానాలు ఇచ్చుంటే సీఎం పదవి డిమాండ్ చేసేవాడిని.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలవద్దని తాను నిర్ణయించుకున్నది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్లేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 2014లో కూడా చాలా అధ్యయనం చేశాకే బీజేపీతో, తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుందని అన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో (2019) మాత్రం పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించామన్నారు. జనసేన పార్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవగాహన లేని వ్యాఖ్యలు మానుకోవాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అవసరమైనప్పుడు కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని.. తాను సీఎం అభ్యర్థిని అయితేనే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని చెప్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు 40 స్థానాలు ఇచ్చినా.. తాను సీఎం పదవి డిమాండ్ చేసేవాడిని పవన్ కల్యాణ్ అన్నారు.
పొత్తులకు జనసేన పార్టీ సిద్ధం.. అనంతరం కర్ణాటక రాష్ట్రంలో కుమార స్వామి 30 సీట్లతోనే సీఎం అయ్యారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తుల గురించి మాట్లాడుతున్నానన్న పవన్.. తమ గౌరవానికి భంగం కలగకపోతే పొత్తులకు తాము సిద్ధమని తెలిపారు. గతంతో పోలిస్తే జనసేన పార్టీకి రాష్ట్రంలో బలం బాగా పెరిగిందన్నారు. ముందస్తు ఎన్నికలపై కూడా పార్టీలో చర్చలు జరుపుతున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అందరితో కలుపుకునిపోయే వ్యక్తిత్వం తనదని.. కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా కలవవు అని పవన్ తెలిపారు. ఓట్లు చీలనివ్వనంటే ప్రధాన పార్టీలు కలవాలన్నదే తన ప్రధాన ఉద్దేశమన్నారు. ఎన్నికల పొత్తులంటే చాలా కష్టమైన వ్యవహారం అని పవన్ కల్యాణ్ వివరించారు.
కచ్చితంగా పొత్తులు: మా గౌరవానికి భంగం కలగకపోతే పొత్తులకు సిద్ధమన్న పవన్.. గతంతో పోలిస్తే జనసేన బలం బాగా పెరిగిందన్నారు. 40 సీట్లలో గెలిపిస్తే నేను కూడా సీఎం సీటు డిమాండ్ చేస్తానన్నారు. కష్టపడి పనిచేస్తే పదవి దానంతట అదే వస్తుందన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు సగటున 7 శాతం ఓట్లు వచ్చాయని.. కొన్నిచోట్ల జనసేనకు 20 - 30శాతం ఓట్లు వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామన్న జనసేనాని.. పొత్తులకు కొన్ని పార్టీలు ఒప్పుకోకపోతే ఒప్పిస్తామని స్పష్టం చేశారు. సీఎం పదవి డిమాండ్ చేయాలంటే.. 30, 40 సీట్లు ఉండాలని పవన్ అన్నారు.
సంచులు ముందే ఎందుకు ఇవ్వలేదు..?.. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప వైసీపీ ప్రభుత్వం పట్టించునే పరిస్థితి లేదని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ పర్యటన ఉందనగానే రాత్రికి రాత్రే పొలాల వద్ద ఉన్న ధాన్యం కోసం సంచులు ఇచ్చారని.. ముందే ఎందుకు ఇవ్వలేదని అధికారులను ఆయన ప్రశ్నించారు
''రైతులు పండించిన ధాన్యాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయి. ధాన్యం కొన్నవారి ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేయడం లేదు. క్షేత్రస్థాయిలోని వాస్తవ నివేదికలను సీఎం జగన్ పరిశీలించలేదు. ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్లినా కారణం లేకుండానే రైతులను అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుంది. మాకు సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే రైతులపై కేసులు పెడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయి.'' అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇవీ చదవండి