Pawan Kalyan in Bhimavaram Meeting: పాతికేళ్ల పాటు మీకోసం కూలీగా పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం బహిరంగ సభలో అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. జనసేన సత్తా ఏంటో అసెంబ్లీలో చాటాలి.. ఏది ఏమైనా సేవ, పోరాటం మాత్రం ఆపను.. బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం రావాలి. దళితులు పారిశ్రామికవేత్తలు కావాలి. అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థిక సాయం చేసేందుకు అండగా ఉంటాం. కులవైషమ్యాలు వదిలేయడం అలవాటు చేసుకుందామని పవన్ సూచించారు.
జగన్ వ్యక్తిగత జీవితం పూర్తిగా తెలుసు: తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే.. వ్యక్తిగతంగా నాపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు తనకు చాలా తెలుసన్నారు. సీఎం, మంత్రుల చిట్టా మొత్తం విప్పగలను అన్నారు. తాను చెప్పేది వింటే.. జగన్ చెవుల్లో నుంచి రక్తం కారుతుందన్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్, క్రిమినల్స్ అని జగన్ ఎగురుతున్నారేమో.. విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని... వైసీపీ నేతలు నోటికి సైలెన్సర్లు బిగించుకోవాలని వపన్ కల్యాణ్ హెచ్చరించారు.
‘‘చిన్న వయసులోనే తాత ప్రోద్బలంతో ఎస్‌ఐ ప్రకాశ్‌బాబుని స్టేషన్‌లో పెట్టి కొట్టిన వ్యక్తి జగన్. పోలీసు వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి సీఎం.. రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించారు. జగన్ చేసిందల్లా ఒక్కటే.. గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా మార్చారు.. ఎవరు గెలుస్తారో చూద్దాం.. సవాల్. ఉభయగోదావరి జిల్లాల్లో వైకాపాతో సై అంటే సై... నిండా మునిగినోడికి చలేంటి. -పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఓడినా.. గెలిచినా: భీమవరంలో ఓడిపోయినా తాను పట్టించుకోలేదని.. ఓటమి, గెలుపు ఉండవు.. ప్రయాణమే ఉంటుందని భీమవరం సభలో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ, సీఎం జగన్పై నిప్పులు చెరిగిన పవన్.. మద్య నిషేధం అంటూనే విక్రయాలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. రెండున్నర లక్షల ఉద్యోగాల హామీపై సీఎం స్పందన లేదన్నారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.. యువత కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? యువతలో ప్రతిభను వెలికితీసే పాలసీలు ఏమైనా తెచ్చారా? ప్రతిభ, నైపుణ్యానికి తగిన పారితోషికం ఇస్తున్నారా? ఎస్సీ, బీసీ కులాలకు చెందిన ఎందరిని ప్రోత్సహించారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన కులాలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని తెలిపారు. భీమవరం నుంచి ఎందరో విదేశాలకు వెళ్లి రాణించారన్న పవన్... విదేశాలకు బ్రెయిన్ డ్రెయిన్ ఎందుకు కొనసాగుతోందో చెప్పాలన్నారు. విదేశీ విద్యా పథకానికి అంబేడ్కర్ పేరు ఉండాలన్నారు. ఐటీ, ఇంజినీరింగ్ నిపుణులు ఇక్కడే ఎక్కువమంది ఉన్నారని... సరైన రాజకీయ వ్యవస్థ లేకుంటే మనకు లాభం ఉండదని తెలిపారు. కులాల పరిధి దాటి నాయకులు ఆలోచించాలని పవన్ కోరారు.