బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్' చిత్రం పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల పఠాన్ సినిమా విడుదలను స్థానికంగా నిలిపివేయాలంటూ గువాహటిలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆ సినిమా పోస్టర్లకు నిప్పంటించి ఆందోళన చేపట్టారు. ఇదే విషయమై.. షారుక్ ఖాన్ తనకు ఆదివారం వేకువజామున 2 గంటలకు ఫోన్ చేశారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. పఠాన్ సినిమాపై జరుగుతున్న పరిమాణాల గురించి షారుక్ ఆందోళన వ్యక్తం చేసినట్లు హిమంత పేర్కొన్నారు.
"అసోం ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షిస్తుంది. పఠాన్ సినిమా విడుదల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని షారుక్ ఖాన్కు హామీ ఇచ్చా. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు నాకు సినిమా థియేటర్ల యజమానుల, చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు."
--హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి
అంతకుముందు శనివారం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అసోం ముఖ్యమంత్రి భిన్నంగా స్పందించారు. 'షారుక్ ఖాన్ ఎవరు? ఆయన గురించి నాకు తెలియదు. పఠాన్ చిత్రం గురించి కూడా తెలియదు. ఈ సమస్యపై బాలీవుడ్ నుంచి అనేక మంది ఫోన్ చేశారు. షారుక్ ఖాన్ చేయలేదు. ఒకవేళ చేస్తే.. పరిశీలిస్తా. శాంతిభద్రతలను ఉల్లంఘించేవారిపై మాత్రం చర్యలు తీసుకుంటాం' అంటూ మీడియా ప్రతినిధులకు హిమంత సమాధానం ఇచ్చారు. అంతకుముందు షారుక్ ఖాన్ ఓ బాలీవుడ్ స్టార్ అని మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా.. రాష్ట్ర ప్రజలు అస్సామీల గురించి ఆందోళన చెందాలని, హిందీ చిత్రాల గురించి కాదని అన్నారు. ఈ క్రమంలోనే త్వరలో వస్తున్న ఓ అస్సామీ సినిమా చూడాలని సూచించారు.
పఠాన్ చిత్రంలోని 'బేషరమ్ రంగ్' సాంగ్తోనే వివాదం మొదలైంది. ఈ పాటలో చిత్ర హిరోయిన్ దీపికా పదుకొనే వస్త్రధారణ తీవ్ర అభ్యంతరకరంగా ఉందని మధ్యప్రదేశ్ హోం మంత్రి, భాజపా సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేశారు. 'బేషరమ్ రంగ్' పాటలో అభ్యంతరకర సీన్లను సరిచేయకపోతే తమ రాష్ట్రంలో 'పఠాన్' చిత్రం ప్రదర్శనపై ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే దీపిరా ధరించిన బికినీ రంగును తప్పుబడుతూ కొంతమంది రాజకీయ నాయకులు, సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ చిత్రం జనవరి 25 విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించారు.