పెగసస్ నిఘా వ్యవహారం, సాగు చట్టాలు సహా ఇతర అంశాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. ప్రతిపక్ష నేతలు శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం, సభాపతులు కోరినప్పటికీ.. వెనక్కి తగ్గటం లేదు. ఈ క్రమంలో ఉభయ సభల్లో శుక్రవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది.
లోక్‌సభలో..
లోక్‌సభ ఉదయం 11 గంటలు సమావేశమవగానే ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు స్పీకర్ ఓం బిర్లా. అయితే.. పెగసస్ స్పైవేర్‌పై చర్చకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి విపక్షాలు. స్పైవేర్‌కు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలన్న డిమాండ్‌తో సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు విఘాతం కలిగించొద్దని, సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. అయినా.. విపక్షాలు వెనక్కి తగ్గక పోవటం వల్ల సభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
తిరిగి ప్రారంభమైన క్రమంలో విపక్షాల ఆందోళనలు కొనసాగించాయి. నిరసనల మధ్యే.. పన్ను చట్టాలు సవరణ బిల్లు 2021పై మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రెట్రోస్పెక్టివ్ విధానం రద్దు చేసేందుకు భాజపా ఇచ్చిన హామీని నెరవెర్చేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు.
అనంతరం మూజువాణి ఓటుతో పన్ను చట్టాలు సవరణ బిల్లు 2021కి ఆమోదం తెలిపింది లోక్‌సభ. అలాగే.. కేంద్ర విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2021కి సైతం ఆమోదం తెలిపింది లోక్‌సభ.
విపక్షాల ఆందోళనలు కొనసాగిన క్రమంలో సభను సోమవారం (ఈనెల 9) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.
రాజ్యసభలో..
సభ ప్రారంభం కాగానే టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రవి కుమార్ దహియాకు అభినందనలు తెలిపారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. అనంతరం పెగసస్ ప్రాజెక్టుపై విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెగసస్ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
పెగసస్, రైతుల ఆందోళనపై వాయిదా తీర్మానంపై తొమ్మిది నోటీసులు అందినట్లు చెప్పారు డిప్యూటీ ఛైర్మన్. వీటిపై చర్చించేందుకు ఛైర్మన్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వీటిపై ప్రతిపక్ష నేత, అధికార పక్ష నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చర్చించి.. సమయం నిర్ణయించాలని సూచించారు.
అనంతరం.. ఆందోళనలతో సభ కొనసాగే పరిస్థితులు లేక మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. వెల్‌లోకి వచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను ఈనెల 9(సోమవారానికి) వాయిదా వేశారు సభాపతి.
ఇదీ చూడండి: రైతుల నిరసనల్లో పాల్గొన్న విపక్షాలు