తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే పిల్లలు మాత్రం తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి బాగోగులు చూసుకునేందుకు ప్రస్తుత కాలంలో ఇష్టపడట్లేదు. అనాధాశ్రమంలో వదిలేయడం, వాళ్లను పట్టించుకోకుండా వేరే ఇంట్లో వదిలేస్తుంటారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
తమను పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదని బిడ్డల పేరిట రాసిచ్చిన భూమిని తమ పేరిట బదిలీ చేయించాలని యాదగిరి అసిస్టెంట్ కమిషనర్ షాలం హుస్సేన్‌కు ఫిర్యాదు చేశారు ఓ వృద్ధుడు, వృద్ధురాలు. ఈ రెండు కేసులను పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్.. సీనియర్ సిటిజన్స్ జస్టిస్ బోర్డు యాక్ట్ 2007 ప్రకారం ఆస్తిని వృద్ధుల పేరిట బదిలీ చేశారు.
యాదగిరి జిల్లాలోని శిరవాలా గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ హిరేమఠ్కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారికి అతడు 10 ఎకరాల భూమిని పంచాడు. కొన్నాళ్లకు రవీంద్రనాథ్ భార్య మరణించింది. ఆ తర్వాత బిడ్డలెవరూ అతడిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో తాను పిల్లలకు ఇచ్చిన 10 ఎకరాల భూమిని తిరిగి ఇప్పించాలని కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కమిషనర్.. 10 ఎకరాల భూమిని రవీంద్రనాథ్ పేరిట బదిలీ చేయాలని ఆదేశించారు.
మరోవైపు, గుర్మల్కల్లోని ధర్మాపుర గ్రామానికి చెందిన శంకరమ్మకు నలుగురు సంతానం. ఆమెకున్న 4 ఎకరాల భూమిని పిల్లలకు పంచేసింది. తాను అనారోగ్యం పాలైన బిడ్డలు పట్టించుకోవట్లేదని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసింది. దీంతో విచారణ జరిపిన అధికారులు ఆమె పేరిట 4 ఎకరాల భూమిని బదిలీ చేసేందుకు ఆదేశించారు.