Pak Terrorist Captured: జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి పట్టుబడ్డ.. పాకిస్థాన్ ఉగ్రవాది తబరక్ హుస్సేన్ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ రూ. 30 వేలు ఇచ్చినట్లు.. ఉగ్రవాది తెలిపాడు. పాక్ కల్నల్ యునస్ చౌద్రీ తనకు డబ్బు ఇచ్చి ఆత్మాహుతి దాడి చేసేందుకు పంపాడని ముష్కరుడు చెప్పాడు.
పాక్ సైన్యానికి చెందిన మేజర్ రజాక్ వద్ద హుస్సేన్ శిక్షణ పొందినట్లు సైన్యాధికారులు తెలిపారు. ఆరు నెలల శిక్షణలో భాగంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కోసం పాక్ సైన్యం నిర్వహిస్తున్న ఉగ్ర శిబిరాలను హుస్సేన్ సందర్శించినట్లు వివరించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన 32 ఏళ్ల హుస్సేన్‌ను.. భారత సైన్యం నౌషెరా సెక్టర్ వద్ద ఆదివారం అదుపులోకి తీసుకుంది. పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపి భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గాయపడ్డ అతడికి చికిత్స అందించింది. మరో ఇద్దరు ముష్కరులు మాత్రం తప్పించుకున్నారు. హుస్సేన్ భారత్‌లోకి చొరబడుతూ పట్టుబడటం ఆరేళ్లలో ఇది రెండోసారని సైన్యాధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: రోడ్డు పక్కన ఛాయ్ తాగుతున్న వారిపైకి దూసుకొచ్చిన కారు