వివాహ వేడుకలో అందరి దృష్టి వధూవరులపైనే. 'ఈడూ జోడూ కుదిరింది. వారి మొహాల్లో పెళ్లి కళ వచ్చింది'.. అంటూ బంధువులు, ఆత్మీయులు ముచ్చటించుకుంటూ సంతోషంగా గడుపుతారు. కానీ, మనం వెళ్లిన పెళ్లిలో అసలు అమ్మాయి, అబ్బాయి లేకపోతే..? వారు అప్పటికే చనిపోయి ఉంటే..? మరణించిన కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేస్తుంటే..? సరిగ్గా ఇలాగే.. దక్షిణ కన్నడ జిల్లా సంప్రదాయం ప్రకారం గురువారం ఓ ప్రేత కల్యాణం జరిగింది. ఇందుకు కర్ణాటకలోని మంగళూరు వేదికైంది. ఈ వేడుకను షేర్ చేస్తూ.. అన్నీ అరుణ్ అనే నెటిజన్ చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
'తాజాగా నేనొక వివాహానికి హాజరయ్యాను. మనం చూసే పెళ్లిళ్ల మాదిరిగానే ఉంటే.. ఇలా నేను మీ ముందుకొచ్చి మాట్లాడేది ఏమి ఉండేది కాదు. ఇక్కడ పెళ్లి కుమారుడు, కుమార్తె 30 ఏళ్ల క్రితమే మరణించారు. ఇప్పుడు వారి వివాహం జరిగింది. దక్షిణ కన్నడ సంప్రదాయం తెలియని వారికి నేను చెప్పే విషయం వింతగానే ఉంటుంది. కానీ ఇది వాస్తవం. ప్రసవ సమయంలో మరణించి ఓ బిడ్డకు.. అదే మాదిరిగా ప్రసవ సమయంలోనే మరణించిన మరో బిడ్డతో ఈ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు. మొదట రెండు కుటుంబాలు కలుసుకొని ఎంగేజ్‌మెంట్ చేస్తారు. మిగిలిన పెళ్లిళ్లమాదిరిగానే వివాహ తంతు అంతా పూర్తి చేస్తారు. మొదట అబ్బాయి తెచ్చిన చీరను వధువు ధరించాలి. ఆమె సిద్ధం కావడానికి కొంత సమయం కూడా ఇచ్చారు. పెళ్లిపీటల మీద కూర్చునే ముందు వారిద్దరూ కలిసి ఏడడుగులు నడిచారు. తాళికట్టడం, ఆశీస్సులు తీసుకోవడం, చదివింపులు, అత్తింటికి వెళ్లడం.. ఇలా అన్నీ సాగాయి.
ఇలా మరణించిన ఆత్మలకు పెళ్లి చేయడం సులభమేనని భావించకండి. సంబంధం కుదుర్చుకునే ముందు అన్ని వివరాలు పరిశీలిస్తారు. పెళ్లి కుమార్తె వయస్సు ఎక్కువని వరుడు కుటుంబం ముందుగా ఓ సంబంధాన్ని తిరస్కరించింది కూడా! ఏదిఏమైనప్పటికీ.. తమ బిడ్డలు మరణాంతరం కూడా సుఖంగా ఉండాలని ఘనంగా వేడుక చేసిన పెద్దలు.. వచ్చిన అతిథులకు రుచికరమైన వంటలు కూడా వడ్డించారు' అంటూ అన్నీ అరుణ్ వరుస ట్వీట్లు చేశారు.
దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. చాలామంది ఈ సంప్రదాయం గురించి తెలుసుకొని అబ్బురపడ్డారు. ఈ వివాహానికి చిన్నారులు, పెళ్లికాని యువతీయువకులు హాజరుకావడానికి వీలులేదు. కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇంతకీ ఈ వధూవరుల పేర్లేంటో తెలుసా..? చండప్ప, శోభ.
ఇదీ చదవండి:
'మతం పేరుతో హింస.. దేశ పురోగతిని దెబ్బతీసే యత్నం'
షోరూం టాయిలెట్లో దాక్కొని.. గర్ల్‌ఫ్రెండ్ కోసం సెల్‌ఫోన్ చోరీ