Omicron Cases In India: కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 16 మందికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 57కు చేరింది.
Omicron Cases In Maharashtra: మహారాష్ట్రలో 8, దిల్లీలో 4, రాజస్థాన్‌లో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం బాధితుల సంఖ్య 28కి చేరినట్లు పేర్కొంది. రాష్ట్రంలో తాజాగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఏడుగురు ముంబయికు చెందినవారే. బాధితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
దిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన తొలివ్యక్తి కోలుకోవడం వల్ల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.
Omicron Cases In Rajasthan: దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలిపింది. మరోవైపు రాజస్థాన్‌లో ఒమిక్రాన్ బారినపడిన వారంతా కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వివరించింది.
అప్రమత్తత అవసరం..
Centre On Omicron: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ , కర్ణాటక, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహా.. దిల్లీ, చండీగఢ్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని టీకాలు వేసుకోవడం నిర్లక్ష్యం చేయవద్దని సూచించింది.
63 దేశాల్లో ఒమిక్రాన్..
Omicron Cases In World: మరోవైపు ప్రపంచదేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది డెల్టా వేరియంట్‌ను త్వరలోనే అధిగమించేలా ఉందని అభిప్రాయపడింది.అయితే ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్ పనితీరుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంది.
ఇదీ చూడండి: దేశంలో ఒమిక్రాన్ 'పీక్' ఎప్పుడు? భారత్ సిద్ధమేనా?