Police kills colleagues: దిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు.. సహోద్యోగులపై కాల్పులకు తెగబడ్డాడు. తన భార్య గురించి అనుచితంగా మాట్లాడారన్న ఆరోపణతో తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు ప్రబీణ్ రాయ్(32) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. చనిపోయిన ముగ్గురు సిక్కిం పోలీసు విభాగానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఇండియన్ రిజర్వు బెటాలియన్‌లో భాగమైన వీరిని.. దిల్లీలోని ఓ ప్లాంటు వద్ద భద్రత కోసం మోహరించినట్లు చెప్పారు.
'మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేఎన్కే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు ఘటన గురించి సమాచారం అందింది. కాల్పులకు గురైన పోలీసులలో ఇద్దరు ఘటనాస్థలిలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరిని బీఎస్ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు' అని రోహిణీ ప్రాంత డీసీపీ ప్రణవ్ తయాల్ వివరించారు. 'తన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని నిందితుడు ప్రాథమిక విచారణలో చెప్పాడు. తద్వారా తనను మానసిక వేధింపులకు గురిచేశారని తెలిపాడు' అని స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ రాయ్ వెల్లడించారు.
భర్తను కత్తితో పొడిచి...
పెళ్లి తర్వాత జీన్స్ ధరించడానికి ఒప్పుకోలేదని భర్తను ఓ యువతి కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఉదంతం ఝార్ఖండ్‌లోని జామ్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్భితా గ్రామంలో వెలుగు చూసింది. పుష్పా హెంబ్రోమ్ అనే యువతి శనివారం రాత్రి జీన్స్ ప్యాంటు ధరించి గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. అయితే, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె వస్త్రధారణపై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పెళ్లి తర్వాత జీన్స్ ఎందుకు ధరించావని భర్త ప్రశ్నించడంతో చెలరేగిన ఘర్షణ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటా మాటా పెరిగే దాకా వెళ్లింది. దీంతో ఆవేశానికి గురైన పుష్ప.. భర్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని ధన్‌బాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడు, కోడలి మధ్య జీన్స్ ధరించే విషయంలో గొడవ జరగడం వల్ల ఆమె కత్తితో పొడిచి చంపినట్టు మృతుడి తండ్రి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: