Odisha Train Accident : ఒడిశాలోని ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదకర ఘటన జరిగింది. గూడ్స్ రైలుకు చెందిన నిరూపయోగ బోగీ కిందపడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
రైల్వే స్టేషన్‌లో గత కొంత కాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలు ఉంది. కార్మికులు అక్కడ మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కిందకు వెళ్లారు కార్మికులు. ఈదురు గాలులు బలంగా వీయడం వల్ల బోగీలు ముందుకు కదిలాయి. దీంతో ఆరుగురు కార్మికులు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. క్షతగాత్రులను కటక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు రైల్వే అధికారులు.
'వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కింద కొందరు కార్మికులు తలదాచుకున్నారు. అయితే ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడం వల్ల రైలు బోగీ ముందుకు కదిలింది. దీంతో బోగీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.' అని సుక్రా సింగ్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
'దూసుకెళ్లిన కారు.. నలుగురు బలి'
ఝార్ఖండ్.. గుమ్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్లిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఆచూకీ కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. ప్రమాదానికి గల కారణాలను వెలికితీస్తున్నారు.
ప్రమాదం ఇలా..
కమదారా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులపైకి అతివేగంగా ఓ కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారును డ్రైవర్ అతివేగంగా నడపడమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
Train Accident in Jharkhand Today : ఝార్ఖండ్‌లో బుధవారం త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్ గేట్‌ను దాటుతున్న ఓ ట్రాక్టర్‌ను.. అదే సమయంలో వచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా ఢీ కొట్టింది. దూరం నుంచే ట్రాక్టర్‌ను గమనించిన లోకో పైలట్.. వెంటనే అప్రమత్తమై ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులను గట్టెక్కించారు. సడెన్ బ్రేకులు వేసి వేల మంది ప్రాణాలను కాపాడారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.