విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్ర రహస్య రత్నభాండాగారం గది తాళం చెవికి సంబంధించిన విషయాలు మళ్లీ వార్తల్లోకి ఎక్కాయి. తాళం చెవి ఎక్కడుంది? గుప్త (గోప్య) మందిరం తలుపులు తెరిపించి సంపద లెక్కిస్తామన్న యంత్రాంగం ఎందుకు మౌనం దాల్చింది. వీటిపై దర్యాప్తు చేసిన జస్టిస్ రఘవీర్ దాస్ నివేదికలో ఏముందని విపక్షాలు, సేవాయత్‌లు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల తర్వాత మళ్లీ తాళం చెవికి సంబంధించి సమాచారాన్ని యంత్రాంగం సమాచార హక్కు చట్టం (ఆర్టీఏ) కింద వెల్లడించిన వివరాలు నివ్వెర పరిచేలా ఉన్నాయి. అందుకే అందరిలో అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
నాటి కలెక్టరు అవాస్తవం చెప్పారా?..
శ్రీక్షేత్ర వాసుని సంపద లెక్కింపు చేసి ఆ వివరాలు తెలియజేయాలని, ఎన్నో ఏళ్లనాటి రత్నభాండాగారం(రహస్య మందిరం) శిథిలం కాకుండా మరమ్మతులు చేయాలని 2018 ఫిబ్రవరిలో విపక్షాలు అసెంబ్లీలో డిమాండ్ చేశాయి. సేవాయత్‌లు, భక్తులు సైతం విపక్షాలకు మద్దతు తెలిపాయి. 1978లో రత్నభాండాగారంలోని స్వామి సంపద లెక్కింపు జరిగినా పూర్తి వివరాలు యంత్రాంగం వద్ద లేవు. ఆ తర్వాత ఈ రహస్య మందిరం తలుపులు తెరవలేదు. దీనిపై పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు రావడంతో మేల్కొన్న ప్రభుత్వం 17 మంది నిపుణులు, ఉన్నతాధికారులతో ఒక సంఘం (కమిటీ) ఏర్పాటు చేసింది. 2018 ఏప్రిల్ 18న సంఘం సభ్యులు రత్నభాండాగారాన్ని సందర్శించారు. మూడు గదులున్న ఈ మందిరంలో నిత్యసేవలు, పండగల్లో పురుషోత్తముడికి అలంకరించే పసిడి, వజ్రవైడూర్య, గోమేదిక, పుష్పరాగాలు, కెంపులున్న తొలి రెండు గదులు మాత్రమే బృందం తిలకించింది. తాళం చెవి లేని కారణంగా మరింత సంపదున్న (రహస్య నిధి) మూడో గదికి వెళ్లలేదు. టార్చ్‌లైట్ ఫోకస్‌తో ఆ గదిలోపల పరిస్థితి చూసిన సభ్యులు గోడలు బలహీనంగా ఉన్నాయని, మరమ్మతులు అవసరమని చెప్పారు. తాళం చెవి మాయం కావడంతో రత్న భాండాగారం రక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని, దీనిపై అధ్యయనం చేయాలని న్యాయశాఖ.. జస్టిస్ రఘవీర్ దాస్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇంతలో మాయమైన తాళం చెవి నకలు కలెక్టర్ కార్యాలయంలో ట్రెజరీ గదిలో కనిపించిందని నాటి పూరీ కలెక్టరు అరవింద అగర్వాల్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆరెనెలల్లో దాస్ కమిషన్ అధ్యయన నివేదిక ప్రభుత్వానికి సమర్పించినా.. వివరాలు బహిర్గతం కాలేదు. శాసన సభలో విపక్షాలు దీనిపై నిలదీసినా నివేదిక గుట్టు విప్పలేదు. కాల ప్రవాహంలో ఇది మరుగున పడిపోయింది. సంపద లెక్కింపు రహస్య గది మందిరం మరమ్మతుల గురించి అంతా మర్చిపోయారు.
విపక్షాల అనుమానాలు..
మూడేళ్ల తర్వాత, ప్రస్తుతం ఆర్టీఏ వివరాలు అందర్నీ విస్మయానికి గురి చేస్తున్నాయి. మాయమైన తాళం చెవి దొరికిందని నాటి కలెక్టరు చెప్పగా, ఇప్పుడది లేదని స్పష్టం కావడంతో మళ్లీ విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. దీనిపై భాజపా అధికార ప్రతినిధి గోలక్‌మహాపాత్ర్, శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. తాళం చెవి ఎక్కడున్నదీ యంత్రాంగం తెలియజేయాలని డిమాండ్ చేశారు. అవాస్తం చెప్పి తప్పించుకున్న నాటి కలెక్టరుపై చర్యలు తీసుకోవాలని, రత్నభాండాగారం తలుపులు తెరిపించాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, మాజీ మంత్రి పంచానన్ కానుంగో మాట్లాడుతూ చిత్తశుద్ధిలేని ప్రభుత్వం శ్రీక్షేత్ర పాలనా వ్యవహారాలు విస్మరిస్తోందని, వాస్తవాలు తెలియజేయకుండా నివేదికలు బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. తాళం చెవి గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమని చెప్పారు. స్వామి సంపద లెక్కింపు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనాను విలేకరులు అడగ్గా సమాధానం దాటేశారు. మరోవైపు శ్రీక్షేత్ర దైతాపతి సేవాయత్ సంఘం ఉపాధ్యక్షుడు బినాయక్‌దాస్ మహాపాత్ర్ మాట్లాడుతూ తాళం చెవి రహస్యం బహిర్గతం చేయాలని, స్వామి సంపద లెక్కింపు జరగాలని డిమాండ్ చేశారు. భాండాగారం మరమ్మతులకు ప్రాధాన్యమివ్వాలన్నారు.
తాళం చెవి మా దగ్గర లేదు..
పూరీకి చెందిన జగన్నాథుని భక్తుడు దిలీప్ చొరాల్ రత్నభాండాగారం తాళం చెవి ఎక్కడుందో తెలియజేయాలని ఆర్టీఏకు ఇటీవల లిఖిత పూర్వకంగా అడిగారు. శనివారం పూరీ అదనపు కలెక్టరు (ఏడీఎం) లిఖిత పూర్వకంగా తెలియజేసిన వివరాల మేరకు. పూరీ కలెక్టరు కార్యాలయంలోని ట్రెజరీలో తాళం చెవి లేదని, అది ఎక్కడున్నదీ తెలియదని పేర్కొన్నారు. ఈ వైనాన్ని దిలీప్ శనివారం రాత్రి పూరీలో విలేకరులకు తెలియజేశారు.
ఇదీ చదవండి: 'ఆన్లైన్లో డ్రగ్స్ స్మగ్లింగ్.. సైబర్‌క్రైమ్ కంటే ప్రమాదకరం'