Obstructions to CBI: ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ, పోలీసులు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే.. జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు, ప్రభుత్వ సలహాదారు.. సీబీఐకి చుక్కలు చూపిస్తున్నారు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ సీబీఐకి ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండదు. వైఎస్ అవినాష్‌రెడ్డి తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో.. వివేకానందరెడ్డిని చంపించారన్న అనుమానాలున్నాయని సీబీఐ అభియోగపత్రంలో పేర్కొన్నప్పటి నుంచి.. ఏదో రకంగా ఆ సంస్థను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. తీవ్ర అన్యాయం జరిగిపోతోందంటూ పెడబొబ్బలు సరేసరి.
సీబీఐపైన, దర్యాప్తు అధికారులపైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. న్యాయస్థానాల్లో వరుసగా పిటిషన్లు వేస్తూ....సీబీఐ దర్యాప్తునకు మోకాలడ్డుతూనే ఉన్నారు. వారికి వత్తాసు పలికేలా, మద్దతిచ్చేలా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, ఆయన అనుచరగణం వ్యవహరిస్తున్నారు. నిందితులకు వెన్నుదన్నుగా నిలవటం రాజధర్మమా? ఇది చట్టబద్ధ పాలనా అన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఏపీలో ప్రజల హక్కుల్ని కాలరాస్తోన్న జగన్ ప్రభుత్వం: 4 ఏళ్లగా జగన్ ప్రభుత్వం ఏపీలో హక్కుల్ని కాలరాస్తోంది. అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిల విషయంలో మాత్రమే వారికి హక్కులు గుర్తుకొస్తున్నాయి. అవినాష్‌రెడ్డి సహా వివేకా హత్యకేసులోని నిందితులు ఎవరైనా.. న్యాయపరంగా, చట్టపరంగా వారికి ఉన్న అన్ని రకాల హక్కుల్ని వాడుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. వాటి కోసం న్యాయస్థానాల తలుపు తట్టడాన్నీఆక్షేపించరు. కానీ అవే హక్కులు రాష్ట్ర ప్రజలకు, ప్రతిపక్ష నాయకులకు, ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించేవారికీ ఉంటాయనే విషయాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించటం, ఆ హక్కుల్ని కాలరాయటంపైనే ప్రజాస్వామ్యవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా ప్రధాని నరేంద్రమోదీతో తమ అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతమైనదని.. విశాఖపట్నంలో జరిగిన సభలో ప్రధాని ముందే జగన్ ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కలవనన్ని సార్లు ప్రధానిని, కేంద్ర మంత్రులను జగన్ కలుస్తుంటారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రం ఆధీనంలోని దర్యాప్తు సంస్థ జగన్ అనుచరగణాన్ని అన్యాయంగా, అక్రమంగా కేసుల్లో ఇరికించే అవకాశం ఉండదు కదా!
దర్యాప్తు సంస్థకు అడుగడుగునా మోకాలడ్డుతున్న వైసీపీ నేతలు: దర్యాప్తులో వెలుగుచూస్తున్న అంశాల ఆధారంగానే ఆ సంస్థ వ్యవహరిస్తోంది కదా! మరి జగన్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఆ సంస్థ దర్యాప్తు తీరును తప్పుపడుతూ ఆరోపణలు చేయడమేంటి? వ్యక్తి లక్ష్యంగా దర్యాప్తు చేస్తున్నారంటూ సీబీఐనే లక్ష్యంగా చేసుకోవటం ఏంటి? నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌పై విచారించే కదా.. అంతకుముందున్న దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను మార్చేసి... సుప్రీంకోర్టు కొత్త సిట్ ఏర్పాటుచేసింది. ఆ సిట్ కూడా హత్యకేసులో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిలదే కీలక పాత్ర అని చెబుతుంటే.. వారిపైనా ఆరోపణలు చేయడమేంటి? అంటే దర్యాప్తు మీకు అనుకూలంగా, మీరు చెప్పినట్లుగా సాగితేనే సీబీఐ సరిగ్గా పనిచేస్తున్నట్లా? అలా కాకుండా వాస్తవాలు వెలికితీస్తుంటే.. ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థకు అడుగడుగునా మోకాలడ్డుతారా?.
చిన్న పోస్టు పెడితే చాలు.. పోలీసుల నిర్బంధంలోనే బాధితులు: వైసీపీ ప్రభుత్వాన్ని, పాలకుల్ని విమర్శిస్తూ ఎవరైనా చిన్న పోస్టు పెడితే చాలు.. ఆగమేఘాలపై పోలీసులు ప్రత్యక్షమై.. బలవంతంగా తీసుకెళ్లిపోతారు. ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పరు. వచ్చినవారంతా మఫ్టీలోనే ఉంటారు. పోలీసులేనా.. ప్రైవేటు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారా అన్న విషయం అర్థంకాదు. అదుపులోకి తీసుకున్నాక.. న్యాయమూర్తి ఎదుట 24 గంటల్లోగా హాజరుపరచాలనే నిబంధనను అడ్డం పెట్టుకుని చివరి క్షణం వరకూ తమ నిర్బంధంలోనే ఉంచుకుంటారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు అక్కడి నుంచి ఇంకోచోటకు తిప్పుతూనే ఉంటారు. ఏ కోర్టులో హాజరుపరుస్తారో, అది ఎక్కడ ఉందో, న్యాయవాదుల్ని ఎక్కడ ఆశ్రయించాలో తెలియక కుటుంబసభ్యులు చాలా ఇబ్బందులు పడుతుంటారు.
సీబీఐకి అడుగడుగునా జగన్ అండ్ కో అడ్డమే: వివేకా హత్య కేసులో ‘జగన్ అండ్ కో’ తీరు మాత్రం హత్యా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్‌కు కొమ్ముకాసేలా ఉన్నాయి. అత్యంత తీవ్రమైన హత్యానేరంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఇప్పటికే నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఫిబ్రవరి 24న ఆయన్ను విచారణకు పిలిచినప్పుడే అరెస్టు చేయాలనుకున్నామని.. నేరుగా హైకోర్టుకే చెప్పింది. అయినా సరే అవినాష్ అరెస్టు కాకుండా ‘జగన్ అండ్ కో’ సీబీఐకి అడుగుడునా మోకాలడ్డుతూనే ఉంది.
సీబీఐపై నిరాధార ఆరోపణలు: ఈ హత్యకేసులో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిల ప్రమేయాన్ని సీబీఐ బయట పెట్టినప్పటి నుంచి ఇదే తీరు. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా సీఎం జగనే అసెంబ్లీలో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి తన సొంత చిన్నాన్న అని, అవినాష్‌రెడ్డి తన మరో చిన్నాన్న కొడుకని.. ఓ కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుందని ప్రశ్నించారు. అలా.. అవినాష్‌రెడ్డికి క్లీన్‌చిట్ ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తరచూ ప్రెస్‌మీట్లు పెడుతూ వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలను సమర్థిస్తూ, సీబీఐపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్‌రెడ్డిని అన్ని రకాలుగా వెనకేసుకొస్తున్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదైన 24 గంటల్లోగా వెబ్‌సైట్‌లో ఉంచాలి. కానీ జగన్ పాలనలో ఏపీ సీఐడీ ఆ నిబంధనలేవీ పాటించట్లేదు. ఈ విభాగం నమోదు చేసిన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటినీ రహస్యంగానే ఉంచుతోంది. నిందితులుగా పేర్కొన్న వారి ఇళ్లలో ఆకస్మికంగా సోదాలు చేసి, వారిని బలవంతంగా తీసుకెళ్లిపోతోంది. చాలా సందర్భాల్లో నిందితులకు, వారి న్యాయవాదులకు వెంటనే ఎఫ్‌ఐఆర్ లభించట్లేదు. ముందస్తు బెయిలు పొందకుండా ఉండేందుకు, న్యాయస్థానాల్ని ఆశ్రయించే వీల్లేకుండా చేసేందుకు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.
అవినాష్ రెడ్డిని విచారణకు పిలవటమే ఆలస్యం.. రకరకాల పిటిషన్లు దాఖలు: అవినాశ్‌రెడ్డి మాత్రం సీబీఐ విచారణకు పిలవటమే తరువాయి.. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా, అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలంటూ అవినాష్‌రెడ్డి న్యాయస్థానాల్లో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు వేస్తున్నారు. ఈ కేసులో నిందితుడైన వైఎస్ భాస్కర్‌రెడ్డి, మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ తదితరులు న్యాయస్థానాల్లో వరుసగా ఏదో ఒక పిటిషన్ వేస్తూనే ఉన్నారు. దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా మారుస్తారంటూ ఒక పిటిషన్, దర్యాప్తు అధికారి, వివేకా కుమార్తె సునీత, అప్రూవర్ దస్తగిరి కుమ్మక్కయ్యారని.. అందువల్ల దర్యాప్తు అధికారినే మార్చేయాలని మరో పిటిషన్.. ఇలా ఒక దాని తర్వాత మరొకటి దాఖలు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వానికి గిట్టని వారిపై, ప్రభుత్వంపై పోరాడేవారిపై, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి.. తనిఖీలు, సోదాలు, అరెస్టులు పేరిట ఠారెత్తిస్తారు. పోలీసులు, సీఐడీ అధికారులు రాత్రివేళల్లో వారి ఇళ్లలోకి వెళ్తారు. తలుపులు విరగ్గొడతారు. గోడలు దూకుతారు. పడక గదుల్లోకీ చొరబడతారు. దుస్తులు మార్చుకునేందుకూ అవకాశం ఇవ్వకుండా అదుపులోకి తీసుకుంటారు. విచారణలో థర్డ్‌డిగ్రీ ప్రయోగిస్తారు. చెప్పని వాంగ్మూలాలు చెప్పినట్లు రాసుకుని, వాటిపై సంతకాలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తారు. విచారణ జరిగేటప్పుడు తమ తరఫు న్యాయవాదుల్ని అనుమతించాలని కోరినా.. కనీసం వారిని గేటు వద్దకు రానివ్వరు.
సమస్య వారిది కాబట్టి హక్కులు గుర్తొచ్చాయా: వివేకా హత్యకేసులో మాత్రం సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి అనేక అవకాశాలు కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తొలుత మార్చి 6న విచారణకు హాజరుకావాలని సీబీఐ అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని, ఆ రోజు రాలేనని చెప్పారు. సీబీఐ తనను విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, ప్రశ్నలు లిఖితపూర్వకంగా అడగాలని, న్యాయవాదిని అనుమతించాలని ఇలా రకరకాల డిమాండ్లు వినిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వమేమో ఏపీలో విచారణల పేరిట అడ్డగోలుగా వ్యవహరించొచ్చా? ఇప్పుడు సమస్య ‘జగన్ అండ్ కో’కి వచ్చింది కాబట్టి హక్కులు గుర్తుకొచ్చాయా?
సామాజిక మాధ్యమ కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ ఏపీ పోలీసులు, సీఐడీ అధికారులు అరెస్టు చేస్తున్న వారిలో అత్యధికులు చాలా సామాన్యులు. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసుకోలేని వారు. తమ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారు. అలాంటి వారినేమో జగన్ ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తోంది.
సామాన్య మహిళ.. అత్యంత ఖరీదైన న్యాయవాదులతో వాదన..!: గంటకు లక్షల్లో రుసుములు వసూలు చేసే అత్యంత ఖరీదైన, ప్రఖ్యాత న్యాయవాదుల్ని పెట్టుకుని జగన్ అండ్ కో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపిస్తోంది. దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను మార్చాలంటూ.. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ.. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఒక్కోసారి ఒక్కో న్యాయవాది హాజరై వాదనలు వినిపించారు. నీరజ్ కిషన్ కౌల్, అనుపంలాల్ దాస్, వి.వి.గిరి వంటి ప్రఖ్యాత న్యాయవాదులు ఆమె తరఫున వాదనలు వినిపించారు. ప్రతి విచారణలో ఒక్కో కొత్త న్యాయవాది హాజరవ్వటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా.. ధర్మాసనం నుంచే ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక సాధారణ మహిళ.. అత్యంత ఖరీదైన న్యాయవాదుల్ని ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తూ పోరాడేవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ న్యాయవాదులు, తటస్థులు గళమెత్తితే వారికి సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఈ నెల 18న ప్రెస్‌మీట్ పెట్టి మరీ సీబీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో సీబీఐ నాటకాలడుతోందని, అందులో భాగంగానే నోటీసులు ఇచ్చి, అరెస్టులు చేస్తోందని ఆరోపించారు.
అక్రమ కేసులపై మాట్లాడితే నోటీసులు.. మరి సీబీఐని విమర్శిస్తున్నవారికి?: సుప్రీంకోర్టు తప్పుపట్టినా సరే సీబీఐ పంథా మారలేదంటూ దర్యాప్తు సంస్థను తప్పుబట్టారు. ఏ ఒక్క కొత్త ఆధారం అన్వేషించకుండా వ్యక్తుల లక్ష్యంగా విచారణ సాగుతోందంటూ విమర్శించారు. వివేకా హత్య కేసులో నిందితులు.. హత్యకు ముందు, ఆ తర్వాత అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిల ఇంట్లోనే ఉన్నారంటూ గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా సీబీఐ తేల్చగా... అది గూగుల్ టేక్ అవుట్ కాదు.. టీడీపీ టేక్ అవుట్ అంటూ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. ఇవన్నీ చట్టబద్ధమేనా? జగన్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై మాట్లాడుతుంటే న్యాయవాదులకూ నోటీసులిస్తున్నారే.. మరీ ఏకంగా సీబీఐనే తప్పుపడుతూ.. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న జగన్ అనుచరగణాన్ని ఏం చేయాలి?
అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తామంటే మాత్రం వైసీపీ బ్యాచ్ పెడబొబ్బలు: ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ చిన్న చిన్న కారణాలకే కేసులు నమోదుచేస్తున్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో సైతం నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేస్తున్నారు. ఈ కేసుల్లో రిమాండ్లను న్యాయస్థానాలు పదే పదే తిరస్కరిస్తూ పోలీసులు, సీఐడీ అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నా సరే.. వాటిని లెక్కే చేయట్లేదు.
కానీ వివేకానందరెడ్డి విషయానికి వస్తే ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ. ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. అలాంటి వ్యక్తి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ యత్నిస్తుంటే మాత్రం మోకాలడ్డుతున్నారు. జగన్ ప్రభుత్వమేమో ఏడేళ్ల లోపు శిక్షలు పడే అవకాశమున్న కేసుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేయొచ్చా? కఠినశిక్ష పడే అవకాశమున్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామంటే మాత్రం పెడబొబ్బలు పెడతారా?.
ఇవీ చదవండి: