NTR Centenary Celebrations: వెండితెర ఆరాధ్య నటుడు.. రాజకీయ దురంధరుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. విజయవాడ వేదికగా శత వసంతాల వేడుకలకు అంకురార్పణ చేయనున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ విశిష్ఠ అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన 2పుస్తకాలను నేడు విడుదల చేయనున్నారు. మహనీయుడి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్ నేతృత్వంతో సావనీర్ కమిటీ ఏర్పడింది.
8 నెలలుగా అవిశ్రాంతిగా కృషి చేసి ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా ఓ వెబ్‌సైట్, యాప్ రూపకల్పన చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ప్రసంగాలు తెలుగుజాతిని ఉర్రూతలూగించాయి. తెలుగుజాతి కీర్తిని స్ఫూర్తిని ప్రపంచమంతా చాటాయి. అలాంటి ప్రసంగాలను ముందు తరాలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాల సంకలనంతో ఓ పుస్తకం, బయట చేసిన ప్రసంగాల సంకలనంతో మరో పుస్తకాన్ని చారిత్రక ప్రసంగాల పేరిట వెలువరించనున్నారు.
నాటితరం వారి నుంచి నేటితరానికీ ఎంతో స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్ గురించి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా నేటి నుంచి నెలరోజులపాటు జయంతి ఉత్సవాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. మహానటుడి క్రమశిక్షణ, పట్టుదల, శ్రమ, నిజాయితీ గురించి రేపటితరానికి స్ఫూర్తి పాఠాలుగా చెప్పేలా కార్యక్రమాలను రూపొందించారు.
అడుగుపెట్టిన ఏ రంగంలోనైనా ఎన్టీఆర్ నెంబర్‌వన్‌గా నిలిచారు. 33ఏళ్ల సినీ ప్రయాణంలో అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించారు. మరెవ్వరూ అందుకోలేనంత ఎత్తు ఎదిగారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ఎనలేని కీర్తిగడించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. పేదలు, బడుగువర్గాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్.
విజయవాడ శివారు కానూరు సమీపంలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు పెద్దఎత్తున అభిమానులు తరలిరానున్నారు. దాదాపు 50వేల మంది హాజరవుతారనే అంచనాతో కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ జన్మదినానికి నెలరోజుల సమయం ఉండటంతో నేటి నుంచి వరుసగా 100 ప్రాంతాల్లో 100 వేడుకలు నిర్వహించనున్నారు .
"అన్న గారు చేసిన రాజకీయ ప్రసంగాలు అన్నీ కూడా.. చారిత్రాత్మక ప్రసంగాలు అనే ఒక బుక్ పబ్లిష్ చేశాం. అలాగే అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలు అన్నీ.. అసెంబ్లీ ప్రసంగాలు అనే మరో పుస్తకం పబ్లిష్ చేశాం. ఈ రెండు పుస్తకాలు కూడా పోలా విక్రం గారు సంకలనం చేశారు". - టీడీ జనార్థన్, టీడీపీ రాజకీయ కార్యదర్శి
"ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో అనేక కోణాలు ఉన్నాయి. ఇప్పటి తరానికి, రాబోయే తరానికి ఆయన ఆలోచనలు, విధానాలు, సిద్ధాంతాలు నిత్య నూతనం. అందువలన ఆయన అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు". - విక్రం పోలా, సీనియర్ జర్నలిస్ట్
ఇవీ చదవండి: