bihar caste census: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం విముఖత చూపుతున్న నేపథ్యంలో.. తమ రాష్ట్రం వరకు ఆ ప్రక్రియ నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాల సామాజిక-ఆర్థిక సర్వేను నిర్దిష్ట గడువు విధించుకొని పూర్తి చేస్తామన్నారు. పట్నాలో ఈ అంశంపై అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సర్వేకు అవసరమైన అనుమతులను కేబినెట్ త్వరలోనే మంజూరు చేస్తుందని చెప్పారు. తమ నిర్ణయానికి రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు పలికాయని వెల్లడించారు.
కుల గణనకు తమ (జేడీయూ) మిత్రపక్షం భాజపా వ్యతిరేకమని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ఆ ప్రక్రియను చేపట్టడం కష్టమని మాత్రమే కేంద్రం చెబుతోందని పేర్కొన్నారు. తాజా అఖిలపక్ష భేటీలో కమలదళం ప్రతినిధులూ పాల్గొన్న సంగతిని గుర్తుచేశారు. సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహణకు భారీగా నిధులు అవసరం కానున్న నేపథ్యంలో బిహార్‌కు కేంద్రం ఆర్థికంగా అండగా నిలవాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నీట్ పీజీ ఫలితాలు విడుదల.. పరీక్ష జరిగిన 10 రోజుల్లోనే