బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టులోని ఒకటో నంబర్ కోర్టురూంలో ఉదయం 10.36 గంటలకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ దత్తా రాకతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. కాగా, మరో ఆరు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఈయన పేరును ప్రతిపాదించారు. కేంద్ర న్యాయశాఖ ఇందుకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ దత్తా నియామకంతో బాంబే హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా విజయ్‌కుమార్ గంగపుర్‌వాలా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కలకత్తా హైకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ సలీల్ కుమార్ దత్తా తనయుడే జస్టిస్ దీపాంకర్ దత్తా. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్ సైతం జస్టిస్ దీపాంకర్ దత్తాకు బంధువే. 1965 ఫిబ్రవరి 9న జన్మించిన జస్టిస్ దీపాంకర్ దత్తా.. 2030 ఫిబ్రవరి వరకు పదవిలో ఉండనున్నారు. 2006 జూన్‌లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, 2020 ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.