Girl 3 Hours Non Stop Dance: ఓ చిన్నారి నాట్యాభినయంతో తిరుమల కొండపై అరుదైన సాహసం చేయనుంది. ఇది గిన్నీస్ రికార్డుగా మారనుంది. ఏడో తరగతి చదువుతున్న ఈ చిన్నారి వేంకటేశ్వరుని భక్తి గీతాలతో తిరుపతి కొండ మెట్ల మార్గంలో 12 కిలోమీటర్లు ఆగకుండా నృత్యం చేస్తూ కొండ కిందికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దాదాపు ఆరు నెలల నుంచి కఠోర సాధన చేస్తోంది. ఈ నెల 10వ తేదీన అరుదైన రికార్డును సొంతం చేసుకునేందుకు పూర్తిగా సిద్ధమయ్యింది నెల్లూరుకు చెందిన చిన్నారి భవ్యహాసిని..
నెల్లూరు నగరానికి చెందిన భవ్యహాసిని ఏడో తరగతి చదువుతోంది. ఐదేళ్లుగా భరత నాట్యంలో శిక్షణ పొందుతోంది. తల్లి చెంచులక్ష్మీ పోస్టల్ ఉద్యోగి, తండ్రి సునీల్ కుమార్ ఏపీఎస్ పీడీసీఎల్లో డీఈగా ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గిన్నీస్ రికార్డును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు భరత నాట్యంలో వేంకటేశ్వరుని సేవ చేయాలని భావించింది.
"నేను గత ఐదు సంవత్సరాల నుంచి నాట్యం నేర్చుకుంటున్నా. రికార్డు సాధించాలనే లక్ష్యంతో ఆరు నెలల నుంచి 21 పాటలతో 3గంటలపాటు ఆగకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను. తిరుమల కొండ నుంచి అలిపిరి వరకు12 కిలోమీటర్లు మంచినీరు కూడా తాగకుండా చేయాలనేదే నా లక్ష్యం. ఇప్పటి వరకూ 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. అందులో 16 శ్రీవారి కల్యాణం సమయంలో చేశా. అలాగే కరాటేలో గ్రీన్ బెల్ట్ కూడా వచ్చింది. డాక్టర్ కావాలనేది నా లక్ష్యం"-భవ్యహాసిని, నృత్యకారిణి
12ఏళ్ల వయస్సు ఉన్న భవ్యహాసిని నెల్లూరులోని కళాదీప్తి ఇనిస్టిట్యూట్లో రికార్డు సాధన కోసం గత ఆరు నెలలుగా సాధన చేస్తోంది. అలిపిరి మెట్లపై 12కిలోమీటర్లు ఆగకుండా, మంచి నీరు ముట్టకుండా, తిండి తినకుండా భక్తితో నాట్యాభినయంతో కొండ కిందకి రావాలనే లక్ష్యంగా పెట్టుకుంది. రోజుకు 3నుంచి ఆరు గంటలు నిర్విరామంగా నృత్యంలో శిక్షణ తీసుకుంటోంది. యోగ్యభాస్యం చేస్తోంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు మంచి ద్రవహారం, బలవర్థక ఆహారం తీసుకుంటోంది. ఖచ్చితంగా రికార్డును సాధిస్తానని ధీమ వ్యక్తం చేస్తోంది భవ్యహాసిని.
గతంలో ఆ చిన్నారి అనేక రికార్డులు సాధించింది. 100కు పైగా వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. ఇండియా బుక్ కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం దిల్లీ పాలక మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నుంచి జ్ఞాపికలు కూడా అందుకుంది. తిరుపతి వైభవోత్సవాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చింది. గరికపాటి నుంచి జ్ఞాపికలు పొందింది. చెప్పుకుంటూ పోతే అనేక ప్రశంసలు ఉన్నాయి. గిన్నీస్ రికార్డు సాధించడమే తమ పాప లక్ష్యమని తల్లిదండ్రులు చెబుతున్నారు. సాధనలో భాగంగా ఇటీవల 3గంటలు నిర్విరామంగా నాట్య ప్రదర్శన కూడా చేసింది.
ఇవీ చదవండి: