కర్ణాటకలోని మైసూర్లో అమానవీయ ఘటన జరిగింది. సోదరిపై ఓ అన్న మూడు నెలలుగా అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది.
తల్లిదండ్రులు మరణించిన కారణంగా బాలిక(16) మైసూర్ జిల్లాలోని గిరిదర్శిని నగర్లో తన అన్నయ్యల వద్ద ఉంటోంది. అయితే.. మద్యానికి బానిస అయిన వినయ్ కుమార్ మూడు నెలలుగా చెల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చగా.. విషయం వెలుగులోకి వచ్చింది. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని చెలువాంబ ఆస్పత్రిలో చేర్చారు. విచారణలో వినయ్ నేరాన్ని అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
పార్టీ కార్యకర్తపై..
పార్టీ మహిళా కార్యకర్తపై వేధింపులకు పాల్పడిన కేసులో కేరళలో సీపీఎం పార్టీ కొట్టాయం బ్రాంచ్ సెక్రటరీ పి.ఎస్ సాజిమోన్ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం తాగించి తనను వేధించాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సీపీఎం యూత్ లీడర్ నాజర్‌తో కలిసి సాజిమోన్.. తన నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
మరో మహిళను వేధించిన కేసులో సాజిమోన్ ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు. తమ పలుకుబడిని ఉపయోగించి బాధిత మహిళ డీఎన్ఏ రిపోర్ట్‌లను మార్చివేశాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.
దళిత మహిళపై..
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. దళిత మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లోని చపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మహిళ తన పొలానికి వెళుతుండగా.. నిందితుడు ఆమెపై దాడి చేసి అత్యాచారానికి యత్నించాడు. మహిళ అరుపులు విని స్థానికులు ఆమెను కాపాడారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువతిపై అత్యాచారం..
మహారాష్ట్ర ఠాణే జిల్లాలో యువతిని అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడ్ని(20) పోలీసులు అరెస్టు చేశారు. కళ్యాణ్ ప్రాంతానికి చెందిన వినేష్ డొంగార్డ్వివ్ తన పొరుగున ఉన్న 17 ఏళ్ల అమ్మాయిపై గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది.
యువతి ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
బాలికపై అత్యాచారం..
మహారాష్ట్రలోని ముంబయిలో మరో దారుణం వెలుగుచూసింది. బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
డ్రగ్స్ కేసులో బాధితురాలి తల్లి శిక్షననుభవిస్తోంది. ఈ క్రమంలో బాలికతో స్నేహం చేసిన ఓ వ్యక్తి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన తల్లికి బెయిల్ తీసుకురావడానికి సహకరిస్తానని హామీ ఇచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని పోలీసులకు బాలిక తెలిపింది. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:లావుగా ఉన్నావంటూ అత్తింట్లో అవమానం- పెళ్లైన పది నెలలకే ఆత్మహత్య!