Credit Card New Rules: క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తూనే ఉంటుంది. వీటివల్ల కార్డుల వినియోగంలో పారదర్శకత ఉండాలని, వినియోగదారుల హక్కులు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటుంది. తాజాగా తీసుకొచ్చిన కొన్ని మార్పులు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వాటి గురించి ఒకసారి పరిశీలిద్దాం. కార్డు వినియోగదారులతోపాటు, ఆ క్రెడిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకూ కొన్ని బాధ్యతలను ఆర్‌బీఐ కొత్త నిబంధనల్లో స్పష్టంగా తెలియజేసింది. కార్డు నిర్వహణలో లోపాలకు కార్డులను జారీ చేసే సంస్థలకూ జవాబుదారీతనం ఉందని పేర్కొంది.
పరిమితి పెరగాలంటే.. క్రెడిట్ స్కోరు, ఆదాయం, సకాలంలో చెల్లింపులు తదితరాల ఆధారంగా కార్డు సంస్థలు క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతామని చెబుతుంటాయి. కార్డు రకం మారడం, ఖర్చు చేసేందుకు అనుమతించే మొత్తం పెరగడం లాంటివి ఇందులో ఉండొచ్చు. ఇప్పటివరకూ బ్యాంకులు దీన్ని సొంతంగానే నిర్ణయం తీసుకొని, వినియోగదారులకు ఆ సమాచారాన్ని అందించేవి. కొన్నిసార్లు అడక్కుండానే పరిమితి పెంచిన కార్డులను పంపిస్తూ ఉండేవి. ఇక నుంచి ఇలా కార్డులు జారీ చేయాలంటే.. తప్పనిసరిగా వినియోగదారుల అనుమతి తీసుకోవాలి. కార్డుదారులకు తెలియకుండా పరిమితిని పెంచి, దానికి ఛార్జీలను విధించేందుకు వీల్లేదు. ఇలా విధిస్తే.. ఆ మొత్తాన్ని వెనక్కి ఇవ్వడంతోపాటు, ఛార్జీలకు రెట్టింపు మొత్తాన్ని వినియోగదారులకు చెల్లించాల్సి ఉంటుంది. కార్డుదారుడు ఈ విషయంలో ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌నూ సంప్రదించవచ్చు. కార్డు రుణాలకూ ఇదే వర్తిస్తుంది.
కనీస చెల్లింపుపై అవగాహన.. చాలామంది క్రెడిట్ కార్డు బిల్లులను పూర్తిగా చెల్లించకుండా.. కనీస బాకీ మొత్తాన్ని చెల్లిస్తుంటారు. సాధారణంగా కార్డు బాకీలో ఇది 5శాతం మేరకు ఉంటుంది. కేవలం కనీస మొత్తం చెల్లిస్తూ ఉండటం వల్ల అధిక వడ్డీ భారం పడుతూ ఉంటుంది. ఈ విషయంలో కార్డు జారీ సంస్థలు వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఆర్‌బీఐ సూచించింది. ప్రతి నెలా కనీస మొత్తాన్నే చెల్లించడం వల్ల బకాయి తీరడానికి కొన్నేళ్లు పడుతుందని బ్యాంకులు బిల్లుపై స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల వినియోగదారులు బిల్లు మొత్తాన్ని తొందరగా తీర్చి, వడ్డీ భారం పడకుండా చూసుకుంటారని ఆర్‌బీఐ ఆలోచన.
పారదర్శకంగా.. క్రెడిట్ కార్డుకు సంబంధించిన కీలక వివరాలను ఒక పేజీలోనే అందించాలని కొత్త నిబంధనల్లో ఆర్‌బీఐ పేర్కొంది. ఛార్జీలు, బ్యాలెన్స్ బదిలీ, చెల్లింపుల ఆలస్యానికి రుసుములు, వివిధ సందర్భాల్లో వర్తించే వడ్డీ రేట్లను ఇందులో తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త ఛార్జీలను విధిస్తే.. వాటి గురించి నెల ముందే వినియోగదారులకు తెలియజేయాలి. కొత్త ఛార్జీల వల్ల కార్డుదారులకు భారం అవుతుంది అనుకుంటే.. వారు ఆ కార్డును స్వాధీనం చేసే హక్కు ఉంటుంది. కొత్త కార్డు దరఖాస్తును తిరస్కరిస్తే అందుకుగల కారణాలను రాత పూర్వకంగా తెలియజేయాలి. తిరస్కరణకు గల కారణాలు తెలిస్తే.. ఖాతాదారులు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందని తెలియజేస్తే.. దరఖాస్తుదారు దాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
కార్డు పోయినప్పుడు.. క్రెడిట్ కార్డు ఎక్కడో పడిపోవడం, దాని ద్వారా అనధీకృత లావాదేవీలు జరిగిన సందర్భంలో నష్టాన్ని భర్తీ చేసేందుకు బీమా పాలసీ తీసుకోవచ్చు. కార్డు సంస్థలు వినియోగదారుల అనుమతితో వీటిని అందించవచ్చు. కార్డు ద్వారా జరిగే మోసపూరిత వ్యవహారాలకు కార్డుదారుడి పాత్ర ఉండదు. కార్డు జారీ చేసే సంస్థలకూ బాధ్యత ఉండదు. దీన్ని బీమా సంస్థలు చూసుకుంటాయి. కార్డు పోయిన మూడు రోజుల్లోగా కార్డుదారుడు ఈ విషయాన్ని బ్యాంకుల దృష్టికి తీసుకురావాలి. అప్పుడే జరిగిన నష్టానికి పరిహారం పొందే హక్కు ఉంటుంది.
ఏడు రోజుల్లోగా.. కార్డు వినియోగదారులు కార్డును రద్దు చేసుకోవాలని అనుకుంటే.. బ్యాంకులు ఆ ప్రక్రియను ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలి. లేదా ఎనిమిదో రోజు నుంచి రూ.500ల వరకూ జరిమానా ఉంటుంది. కార్డుదారుడు పైసలతో సహా పూర్తి బిల్లును చెల్లించినప్పుడే కార్డు రద్దు అవుతుంది. కార్డును ఏడాదిపాటు వినియోగించకుంటే.. దాన్ని రద్దు చేసే అధికారం బ్యాంకులకూ ఉంటుంది. దీనికోసం 30 రోజుల ముందుగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ వినియోగదారుడు స్పందించకపోతే.. కార్డు రద్దు అవుతుంది. కార్డు చేతికి అందిన 30 రోజుల వరకూ కార్డును యాక్టివేట్ చేసుకోకపోతే.. జారీ సంస్థ ఓటీపీ ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకోవాలని కోరుతుంది. అప్పటికీ వినియోగదారుడు స్పందించకపోతే.. ఆ తర్వాత ఏడు రోజుల వ్యవధి తర్వాత కార్డును చార్జీలూ విధించకుండానే కార్డును రద్దు చేసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: గూగుల్‌పే, ఫోన్‌పే చేస్తున్నారా? ఇలా మోసపోవచ్చు! బీ అలర్ట్!!