Madhya Pradesh girl going Pakistan: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి పాకిస్థాన్ యువకుడితో ప్రేమలో పడి.. అట్టారీ వాఘా సరిహద్దు ద్వారా దేశం దాటేందుకు ప్రయత్నించింది. పాస్‌పోర్ట్, ధ్రువపత్రాలన్నింటినీ వెంటబెట్టుకొని సరిహద్దుకు వెళ్లిన ఆమెను కస్టమ్స్ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని పంజాబ్ అమృత్‌సర్‌లోని ఘరిండా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆమెను ఫిఝా ఖాన్‌గా గుర్తించారు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోగానే.. మధ్యప్రదేశ్‌లోని రేవా పట్టణంలో ఉండే కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అన్ని ధ్రువపత్రాలు తీసుకొని వెళ్లిపోయిందని పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు జరపగా యువతి పాకిస్థాన్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అధికారులతో సమాచారం పంచుకున్నారు. పంజాబ్ పోలీసులు ఆమెను.. జిల్లా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి.. కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారు.
'పాకిస్థాన్‌కు చెందిన యువకుడు దిల్షద్ ఖాన్‌తో యువతి ప్రేమలో పడింది. ఫేస్బుక్ ద్వారా వీరిద్దరికీ పరిచయం అయింది. ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమె.. ఆ యువకుడి కోసమే పాకిస్థాన్ వెళ్లాలని అనుకుంది. యువతిని ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులకు అప్పగించాం' అని అమృత్సర్ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: