భార్యభర్తలు తమ మధ్య ప్రేమను ఒక్కో రూపంలో చాటుకుంటూ ఉంటారు. వివిధ కానుకలను ఇచ్చిపుచ్చుకుంటూ తమ బంధాన్ని బలపర్చుకుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ ప్రకాశ్ చౌక్సే మాత్రం తన భార్యకు ఆ కానుకను కాసింత వైవిధ్యభరితంగా అందించారు. అలనాడు షాజహాన్ తన భార్యకు తాజ్‌మహల్‌ను నిర్మించి కానుకగా ఇస్తే.. తానేమి తక్కువ కాదని తన సతీమణికి కూడా ఆనంద్ ప్రకాశ్ అచ్చం తాజ్‌మహల్‌ను పోలిన ఇల్లు నిర్మించి కానుకగా ఇచ్చారు.


సాధారణంగా ఇల్లు కట్టుకోవాలంటే ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. మరి కడుతుంది తాజ్‌మహల్ లాంటి ఇల్లు కదా. ఆనంద్ ప్రకాశ్‌కు ఈ ఇంటిని నిర్మించేందుకు మూడేళ్ల సమయం పట్టింది.


తన భార్యకు ఏదైనా కానుక ఇవ్వాలని భావించినా అది వైవిధ్యంగా ఉండాలని భావించే తాజ్‌మహల్ లాంటి ఇంటిని నిర్మించి ఇచ్చినట్లు ఆనంద్ ప్రకాశ్ తెలిపారు. అయితే అసలు తాజ్‌మహల్ కంటే తమ తాజ్‌మహల్ ఇల్లు పరిమాణంలో తక్కువగా ఉంటుందని వివరించారు.


"ఇంటిని నిర్మించుకున్నప్పుడు ఏదైనా వైవిధ్యంగా ఉండాలని భావించాను. కచ్చితంగా ఏ భర్త అయినా తన భార్యపై ఎక్కువ ప్రేమ కురిపిస్తాడు. ఇంటి రూపంలో ఇది ఓ కానుక అని నా భార్యకు చెప్పాను. ఇంటిలో హాలు, వంటగది, నాలుగు బెడ్‌రూంలు, ధ్యానం కోసం ఒక గది ఉంది. అసలు తాజ్‌మహల్ పరిమాణంలో మా ఇల్లు మూడో వంతు ఉంటుంది. అసలు తాజ్‌మహల్ పరిమాణం మీటర్లలో ఉంటే మా తాజ్‌మహల్ ఇల్లు అడుగుల్లో ఉంటుంది. అసలు తాజ్‌మహల్ మినార్లు 40 మీటర్లు ఉంటే మా తాజ్‌మహల్ ఇల్లు మినార్లు 40 అడుగుల ఎత్తు ఉంటాయి."
- ఆనంద్ ప్రకాశ్ చౌక్సే, ఇంటి యజమాని
బుర్హాన్‌పూర్‌లో అందమైన తాజ్‌మహల్ లాంటి ఇంటిని చూసేందుకు స్ధానికులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదీ చూడండి: డోలు వాయిస్తూ.. డ్యాన్స్‌తో సీఎం సందడి