కొవిడ్-19 కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం దేశమంతా ఆశగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలక పర్యటనలు చేపట్టనున్నారు. భారత్‌లో కరోనా టీకాను అభివృద్ధి చేస్తోన్న భారత్ బయోటెక్, సీరం, జైడస్ క్యాడిలా సంస్థలను నేడు సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించనున్నారు. మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పర్యటన సందర్భంగా వ్యాక్సిన్‌కు సంబంధించి మోదీ కీలక ప్రకటన చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొదట జైడస్..
ప్రధాని మొదట గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా కర్మాగారాన్ని సందర్శిస్తారు. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న 'జైకోవ్-డి' టీకా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది. అహ్మదాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంగోదర్ పారిశ్రామిక ప్రాంతానికి శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చేరుకుంటారు.
భారత్ బయోటెక్‌కు...
శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని హకీంపేట వైమానికి స్థావరానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి నగర శివార్లలోని జినోమ్ వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు. ఈ సంస్థ 'కొవాగ్జిన్' పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది. మూడో దశ క్లనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మోదీ ఆ సంస్థలో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు. అక్కడాయన సుమారు గంటసేపు గడుపుతారు.
సీరం సందర్శన..
పుణె పర్యటనలో భాగంగా... అస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తోన్న 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు. టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీస్తారు. అనంతరం మోదీ దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
సీరం సంస్థ తయారు చేస్తున్న ఈ టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి.
ఇదీ చదవండి:'నివర్' తుపాను బాధితులకు ప్రధాని సాయం