Modi punjab visit: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో బుధవారం నాటకీయ పరిణామాలు జరిగాయి. ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్‌లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. "కొన్ని కారణాల వల్ల సభకు మోదీ హాజరు కావడం లేదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా.. సభా వేదికపై ప్రకటించారు. అయితే.. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది.
నిరసన సెగ..
"బఠిండా విమానాశ్రయానికి బుధవారం ఉదయం.. మోదీ చేరుకున్నారు. అక్కడి నుంచి హుస్సేనీవాలాలోని స్వాతంత్య్ర సమర యోధుల స్మారకం వద్ద నివాళి అర్పించేందుకు హెలికాప్టర్లో వెళ్లాలని భావించారు. అయితే.. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆయన 20 నిమిషాలపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ.. పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల రోడ్డు మార్గంలో బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. అందుకు రెండు గంటల సమయం పడుతుంది.
రోడ్డుమార్గంలో వెళ్లేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని పంజాబ్ డీజీపీ చెప్పారు. మోదీ కాన్వాయ్.. హుస్సేనీవాలాకు బయల్దేరింది. గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరం ఉండగా.. ఆయన కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పైకి చేరుకుంది. అక్కడ కొంతమమంది నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు. ఫ్లైఓవర్‌పై 15 నుంచి 20 నిమిషాలపాటు మోదీ కాన్వాయ్ ఉండిపోయింది. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది.
పంజాబ్‌లో ప్రధాని పర్యటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలియజేశాం. నిబంధనల ప్రకారం రోడ్డు మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అదనపు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం మోహరించవలసి ఉంటుంది. అయితే.. అది సక్రమంగా జరగలేదు. దీంతో భద్రతా పరమైన సమస్యలు తలెత్తగా.... ప్రధాని మోదీ కాన్వాయ్ తిరిగి బఠిండా విమానాశ్రయానికి చేరుకుంది."
-కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
భద్రతా లోపాల్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని కేంద్రం హోం శాఖ తెలిపింది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మోదీ కీలక వ్యాఖ్యలు
పంజాబ్ పర్యటనలో జరిగిన పరిణామాలపై నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. "నేను బఠిండా విమానాశ్రయం వరకు సజీవంగా రాగలిగాను. ఇందుకు మీ ముఖ్యమంత్రికి నా తరఫున ధన్యవాదాలు చెప్పండి" అని విమానాశ్రయంలోని అధికారులతో మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
'అంతా రాష్ట్ర ప్రభుత్వమే చేసింది!'
Nadda on punjab government: పంజాబ్‌లో మోదీ సభ రద్దు కావడంపై భాజపా ఘాటుగా స్పందించింది. ప్రధాని పర్యటనకు ఆటంకం కలిగించాలని పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఆరోపించింది. "రూ.వేల కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఉద్దేశించిన మోదీ పర్యటన రద్దు కావడం బాధాకరం. సభకు ప్రజలు హాజరుకాకుండా చూడాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనకు ఆటంకం ఎదురైన సమయంలో.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు, ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ.. ఫోన్లో కూడా అందుబాటులో లేరు" అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.
'రాష్ట్రపతి పాలన విధించాలి'
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో చన్నీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. "పాకిస్థాన్ సరిహద్దుకు 10కిలోమీటర్ల దూరంలో మోదీ సభాస్థలి ఉంది. ప్రధాని పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేకపోతే.. ఇంకా ఏం చేయగలదు? మనకు బలమైన ప్రభుత్వం కావాలి" అని ఆయన చెప్పారు.
'ఫ్లాప్ షో అని తెలిసే..'
మోదీ పర్యటన సందర్భంగా... పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని భాజపా చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర మంత్రి రాజ్‌కుమార్ వర్కా తోసిపుచ్చారు. "ప్రధాని పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేవు. భద్రతా నియమాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందనే ఆరోపణలు నిరాధారమైనవి. అసలు నిజమేంటంటే... పంజాబ్‌లో సభ ఫ్లాప్ షో అవుతుందని ప్రధానికి అర్థమైంది. అందుకే ఆయన పలాయనం చిత్తగించారు" అని రాజ్‌కుమార్ విమర్శించారు.
సీఎం విచారం..
ప్రధాని మోదీ ఫిరోజ్‌పుర్ పర్యటన నుంచి వెనుదిరగటంపై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ విచారం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీకి బఠిండాలో తాను స్వాగతం పలకాల్సి ఉన్నప్పటికీ... తన వెంట ఉండే ఒకరికి కరోనా పాజిటివ్ రావడం వల్ల వెళ్లలేకపోయినట్లు చెప్పారు. అయితే ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
"మొదట వాయుమార్గం ద్వారా వెళ్లాలనుకున్న మోదీ... ప్రభుత్వానికి చెప్పకుండానే రోడ్డుమార్గం ద్వారా వెళ్లారు. అయినప్పటికీ.. మధ్యాహ్నం 3గంటలకల్లా రోడ్డు క్లియర్ చేయాలని ఆందోళనకారులకు సూచించాం. ఫిరోజ్‌పుర్ సభ కోసం 70 వేల కుర్చీలు చేస్తే.. 7వందల మంది మాత్రమే వచ్చారు. వర్షం, ఇతర కారణాలను సాకుగా చూపి.. ఫిరోజ్‌పుర్ సభను వాయిదా వేసుకున్నారు"
-చరణ్‌జీత్ సింగ్ చన్నీ, పంజాబ్ ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి: భాజపా వాట్సాప్ గ్రూప్స్‌కు కేంద్రమంత్రి గుడ్‌బై.. పార్టీకి కూడా?
ఇదీ చూడండి: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం