Delhi Liquor Scam Updates: ఈడీ గత ఏడాది నవంబరు 30వ తేదీన కోర్టుకు సమర్పించిన అమిత్ అరోరా రిమాండ్ నివేదికలో మద్యం కేసు నిందితులు, అనుమానితులుగా ఉన్న 36 మంది ఏడాది కాలంలో కనీసం 170 ఫోన్లను ధ్వంసం చేయడమో, మార్చడమో జరిగినట్లు పేర్కొంది. విచారణను సీబీఐకి అప్పగించిన వెంటనే.. ఇందులో భాగస్వామ్యం ఉన్నవారు డిజిటల్ సాక్ష్యాధారాలను చెరి పేసే ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలిపింది. ఇందులో కవితకు చెందిన పది సెల్‌ఫోన్లు ఉన్నట్లు పేర్కొంది. వాటిలో నాలుగు ఫోన్లను.. కవిత 2022 ఆగస్టు 9, 22, 23 తేదీల్లో మార్చడమో, ధ్వంసం చేయడమో జరిగినట్లు ఆ నివేదికలో వివరించింది.
ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ఆమె తాను ఉపయోగించిన ఫోన్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకెళ్లి సమర్పించారు. అందులో ఉపయోగించిన సెల్‌ఫోన్ నంబర్లు, ఆ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను వాటిపై అతికించి మరీ ఇచ్చారు. ఈ అంశంపైనే మంగళవారం నాటి విచారణలో ఈడీ అధికారులు ప్రశ్నించి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇతర నిందితులతో కలిపి విచారించారా?: ఇతర నిందితులతో కలిపి విచారించారా? అన్న దానిపై స్పష్టత లేదు. అంతర్గతంగా జరిగిన విచారణ వివరాలేవీ బయటకు రాలేదు. మంగళవారం రాత్రి 7.45 గంటల సమయంలో బీఆర్ఎస్ లీగల్ విభాగం ప్రధాన కార్యదర్శి సోమభరత్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. మూడు రోజుల విచారణలో భాగంగా.. కవిత ఇచ్చిన వాంగ్మూలాలపై సంతకాలు చేయించుకొనే క్రమంలో ఆథరైజేషన్ కోసం న్యాయవాది అయిన సోమభరత్‌ను పిలిపించినట్లు తెలుస్తోంది. వరుసగా విచారణకు పిలుస్తున్న ఈడీ ఎప్పుడేం చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్న సమయంలో కవిత మూడో రోజూ విచారణ ముగించుకొని బయటికి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది.
ఈడీకి లేఖ రాసిన కవిత : ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. విచారణకు సంబంధించి వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని తెలిపారు. తనపై ఫోన్ల ధ్వంసం ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈడీ ఆరోపించిన పది సెల్‌ఫోన్లను ఐఎంఈఏ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లుగా వివరించారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా తన మొబైల్ ఫోన్లను కోరారని చెప్పారు. అయినా ఇందులో భాగంగానే తాను ఉపయోగించిన అన్ని సెల్‌ఫోన్లు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలిగించదా అని ఆమె లేఖలో ప్రశ్నించారు.
నిన్న విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత దిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అక్కడి నుంచి వారు నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు.
ఇవీ చదవండి: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. నేడు ఎనిమిదిన్నర గంటల పాటు..
ఈడీ డైరెక్టర్‌కు కవిత లేఖ.. మహిళగా తన స్వేచ్ఛకు భంగం కలిగించారంటూ..