MLA QUOTA MLC ELECTIONS : రాష్ట్రంలో 7ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLC) స్థానాలకు ఈ నెల 23న ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీకు సాంకేతికంగా 6స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా 7స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సాంకేతికంగా ఒకటి గెలుచుకునే అవకాశం ఉన్నా.. నైతిక మద్దతు లేనికారణంతో తటపటాయిస్తూనే తమ అభ్యర్థిగా బీసీ మహిళ పంచుమర్తి అనురాధను ఎన్నికల బరిలో నిలబెట్టింది.
ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం సభ్యుల సంఖ్యను.. ఖాళీ స్థానాలకు అదనంగా ఒకటి కలిపి భాగించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం శాసనసభ్యులున్న 175 సంఖ్యను 8 తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. పోటీలో ఉన్న 8మంది సభ్యులకు సమానంగా 22 మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తే 23వఓటు వచ్చినవారు తొలుత గెలుపొందనట్ల అవుతుంది. ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యత ఓట్లు దగ్గర ఆగిపోతే అప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి.
"మంత్రులకు కచ్చితంగా ఏడు సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి అన్నారంటే.. కచ్చితంగా గెలువలేము అనే అనుమానం ఆయనకు వచ్చినట్టుంది. ఎందుకంటే వారి శాసనసభ్యులు ఆత్మప్రభోదానుసారం ఎక్కడ ఓటు వేస్తారేమో అని భయపడ్డట్లుంది. ముఖ్యమంత్రిలో అభద్రతా భావం కచ్చితంగా కనపడుతోంది" -పయ్యావుల కేశవ్, టీడీపీ సీనియర్ నేత
అసెంబ్లీలో పార్టీల బలాబలాలను చూస్తే అధికార వైసీపీకు 151 మంది సభ్యుల బలం ఉంది. ఈ బలం ఆరుగురు సభ్యులను మాత్రమే గెలిపించుకునేందుకు సాధ్యపడుతుంది. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్‌లు వైసీపీలో చేరారు. వీరితో పాటుగా జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీతోనే ఉన్నారు. దీంతో తమకు 156 మంది సభ్యుల బలం ఉందని వైసీపీ అంటోంది. ఐతే తెలుగుదేశం వ్యూహాత్మకంగా అంతరాత్మ ప్రభోదానుసారం అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది.
"శాసన సభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా అంతరాత్మ ప్రభోదించిన మేరకే ఓటు వేస్తానని స్పష్టంగా తెలియజేస్తున్న. నేను ఈ మాటకే కట్టుబడి ఉన్న"-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
గత కొంత కాలంగా వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు.. అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు. వైసీపీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటేయకుంటే వారికున్న మిగిలిన బలం 154మంది. అంటే 7గురు సభ్యులకు సరిగ్గా 22ఓట్లు వేసుకోవచ్చు. ఐతే ఎలాంటి విప్ లేకుండా రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఓటింగ్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
"భవిష్యత్తులో ఈ వ్యవస్థలు మెరుగు అయ్యేవరకూ, నేను చివరి శ్వాస పీల్చే వరకూ, చివరి ఓటు వేసే వరకూ కూడా అంతరాత్మ ప్రభోదనంతో ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను"-ఆనం రామనారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: