Militants killed Kashmiri pandit: కశ్మీర్‌లో పండిట్లపై ముష్కరుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా షోపియాన్ జిల్లాలో.. ఓ వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. చౌదరీ గండ్ ప్రాంతంలోని పురన్ కృష్ణన్ భట్‌పై.. ఉగ్రవాదులు దాడి చేశారు. ఇంటి గార్డెన్ వద్దే అతడిని ముష్కరులు కాల్పులు జరిపారు. అది గుర్తించిన స్థానికులు.. కృష్ణన్ భట్‌ను షోపియాన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశాయి.
కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే సంస్థ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుందని డీఐజీ సుజిత్ కుమార్ తెలిపారు. ఎందుకు హత్య చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 'బాధితుడు స్కూటర్‌పై బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు. అతడు ఒంటరిగా లేడు. ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు. ఒక్కడే వచ్చి దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న గార్డు సహా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం' అని సుజిత్ కుమార్ స్పష్టం చేశారు.
ఉగ్రవాదుల చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని మనోజ్ సిన్హా అభివర్ణించారు. బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, భాజపా సహా పలు రాజకీయ పార్టీలు ఈ ఘటనను ఖండించాయి.
18 కేజీల ఐఈడీ
మరోవైపు, బందిపొరా జిల్లాలో భారీ ఐఈడీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని ఆస్తాంగో ప్రాంతంలో ఇవి లభ్యమయ్యాయి. 18 కేజీల ఐఈడీని రెండు గ్యాస్ సిలిండర్లలో అమర్చినట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలు దొరికిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఐఈడీని సురక్షితంగా పేల్చివేసినట్లు స్పష్టం చేశారు.