Muzaffarpur cataract surgery failed: బిహార్ ముజఫర్‌పుర్‌లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పలువురు కంటి చూపు కోల్పోయారు. బాధితులకు నిర్వహించిన కేటరాక్ట్ ఆపరేషన్ విఫలమైందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ తర్వాత కంట్లో మంట, నొప్పిగా ఉందని బాధితులు వాపోయినా.. వైద్యులు పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పటికే నలుగురు కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారంతా కంటి మార్పిడి చికిత్సలు చేయించుకున్నారు. మరికొందరు బాధితులకు సైతం ఈ శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. మొత్తం 25 మందికి ఈ చికిత్స జరిగినట్లు తెలుస్తోంది.
Cataract surgery failure Bihar: జిల్లాలోని జురాన్ ఛాప్రా ప్రాంతంలో ఈ కంటి ఆస్పత్రి ఉంది. నవంబర్ 22న ఆస్పత్రిలో కేటరాక్ట్ ఆపరేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ సమయంలోనే పదుల సంఖ్యలో బాధితులు చికిత్స చేయించుకున్నారు. చికిత్స కోసం వచ్చిన తమకు.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల కంటి చూపు పోయే ప్రమాదం తలెత్తిందని బాధితులు వాపోతున్నారు.
ఆస్పత్రిని వదిలి పారిపోయి...
చికిత్స వల్ల తలెత్తిన సమస్యలు వారం రోజుల తర్వాత కూడా నయం కాలేదని బాధితులు చెప్పారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను సంప్రదిస్తే ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారని వివరించారు. కంటిని తీసేయించకపోతే మరో కన్నుకూ ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు హెచ్చరించారని చెప్పారు. దీంతో, వైద్యుల నిర్వాకంపై బాధితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి ముందు పలువురు ఆందోళనకు దిగారు. దీనిపై సివిల్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ శర్మకు సమాచారం అందించారు. దీంతో బాధితులను వదిలేసి సిబ్బంది ఆస్పత్రి నుంచి పారిపోయారు.
చర్యలు తప్పవు..
ఈ వ్యవహారంపై స్పందించిన డాక్టర్ వినయ్ కుమార్ శర్మ.. బాధితులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇందుకోసం ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమించినట్లు తెలిపారు. తప్పు చేసినట్లు తేలితే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సలసల కాగే నూనెలో నుంచి చేతితో అరిసెలు తీసి...