Man Got Two Jobs in 24th Attempt : కొందరు లక్ష్యసాధనలో ఒకసారి విఫలమైతే అంతా అయిపోయిందన్నట్లు నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. కానీ అలాంటి వారికి మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నాందేడ్ జిల్లా మాతల గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు 23సార్లు ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో విఫలమైనా నిరాశ చెందలేదు. విఫలమైన ప్రతిసారీ ఓ తప్పులను సరిదిద్దుకొని ఆశావాహదృక్పథంతో ముందుకెళ్లాడు. ఎట్టకేలకు 24వ ప్రయత్నంలో ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షల్లో 25వ ర్యాంకు సాధించి ట్యాక్స్ అసిస్టెంట్‌గా, మంత్రుల కార్యాలయంలో గుమాస్తా ఉద్యోగం సాధించాడు. అంతేకాదు మాతల గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన మెుదటి వ్యక్తిగా నిలిచాడు.
"ఈనెల 14వ తేదీన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో నాకు 25వ ర్యాంక్ వచ్చింది. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుతోపాటు క్లర్క్ పోస్టుకు ఎంపికయ్యాను. ఇప్పటివరకు 24సార్లు ఎమ్పీఎస్పీ నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యాను. 24వ ప్రయత్నంలో విజయం సాధించాను. 23 ప్రయత్నాల్లో నేను చాలా విషయాలను నేర్చుకున్నాను."
-సాగర్, ప్రభుత్వ ఉద్యోగి
రైతు కుటుంబానికి చెందిన సాగర్ వ్యవసాయం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరయ్యేవాడు. పొలం పనులు పూర్తికాగానే గ్రంథాలయానికి వెళ్లి గంటల తరబడి చదివేవాడు. వరుసగా పరీక్షల్లో విఫలమైనా నిరుత్సాహ పడకుండా గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాడు. మాతల గ్రామంలో మెుదటి ప్రభుత్వ ఉద్యోగి సాగరే కావడం వల్ల అక్కడవారి సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. సాగర్‌కు వచ్చిన ఉద్యోగం తమకే వచ్చినట్లు మురిసిపోయారు. గ్రామస్థులు సాగర్‌ను తమ భుజాలపైకి ఎత్తుకొని ఊరంతా ఊరేగించారు. సాగర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం తమకు గర్వకారణంగా ఉందని మాతల గ్రామస్థులు చెప్పారు.
"మా గ్రామంలో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించినవారు ఎవరూ లేరు. ముంబయిలో ట్యాక్స్ అసిస్టెంట్‌గా సాగర్‌కు ఉద్యోగం వచ్చింది. అతడి కుటుంబం మెుత్తం వ్యవసాయం మీదే ఆధారపడింది. వారికి రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది" అని సాగర్ స్నేహితుడు కుల్‌భూషణ్ శిందే తెలిపాడు.
ఒక్కసారి విఫలమైతే అంతా అయిపోయిందని తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యే వారికి 24వ ప్రయత్నంలో ప్రభుత్వం ఉద్యోగం పొందిన సాగర్ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
A Person Get Two Government Jobs : రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ఆదర్శంగా నిలుస్తోన్న యువకుడు