Mamata banerjee news: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ కార్యకర్తల మధ్య పురిలియాలో జరిగిన సమావేశం నవ్వులు పూయించింది. కార్యకర్తలతో దీదీ మాట్లాడుతున్న సమయంలో ఓ భారీకాయుడి వంతు వచ్చింది. అతడు మమతతో ఏదో విషయం చెబుతుండగా.. ఆమె మధ్యలో కలగజేసుకున్నారు. 'బస్తా లాంటి నీ పొట్ట చూస్తుంటే ఏదో ఒక రోజు నువ్వు కుప్పకూలిపోతావ్ అనిపిస్తుంది? నీ ఆరోగ్యం బాగానే ఉందా?' అని అడిగారు. అందుకు అతను బదులిస్తూ.. 'నాకు షుగర్, బీపీ లాంటివి ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉన్నాను మేడం' అని అన్నాడు. తాను రోజూ వర్కవుట్లు కూడా చేస్తానని దీదీని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె మాత్రం అసలు నమ్మలేదు. 'నీకు కచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండి ఉంటుంది. నీ మధ్యప్రదేశ్ చాలా భారీగా ఉంది' అని మరోసారి అతడ్ని ఇరకాటంలో పడేశారు. అయితే పొట్ట పెరగడానికి అసలు కారణమేంటో చివరకు అతను వెల్లడించాడు. తానూ రోజు ఉదయం పకోడీలు, బజ్జీలు తింటానని, అది చిన్నప్పటి నుంచి అలవాటని చెప్పాడు. కానీ రోజూ ఎక్సర్సైజ్ చేస్తానని మళ్లీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఈ సమాధానం విని దీదీ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. 'పొద్దు పొద్దున్నే పకోడీలు ఎందుకు తింటున్నావ్? అలా తింటే నీ పొట్ట ఎప్పటికీ కరగదు. నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నావో చెప్పు. నువ్వు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తావో చెప్పు? అని అడిగారు.
అందుకు అతను బదులిస్తూ 'నేను రోజు ప్రాణాయామం చేస్తా. 1000 సార్లు శ్వాస పీల్చి వదులుతా' అని చెప్పాడు. అందుకు దీదీ స్పందిస్తూ 'అది అసాధ్యం. నేను నమ్మను. నువ్వు ఇప్పుడు 1000 సార్లు చేసి చూపిస్తే నీకు రూ.10వేలు ఇస్తా. నీకు ప్రాణాయామంలో శ్వాస ఎలా తీసుకోవాలో, ఎలా వదలాలో కూడా తెలియదు' అన్నారు.
ఆ తర్వాత తనతో మాట్లాడిన జల్ధా మేయర్ సురేశ్ బరువు 125 కిలోలు అని తెలిశాక దీదీ మరోసారి గట్టిగా నవ్వారు. 'ఇంత బరువు ఉన్న నువ్వు వెంటనే పకోడీలు తినడం మానెయ్. వ్యాయామం మొదలుపెట్టు. అప్పుడే పొట్ట కరుగుతుంది. నెల రోజులు అన్నమే తిను. రాత్రిపూట తిన్న తర్వాత ఒక కిలోమీటర్ నడువు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఉండు. నువ్వు ఇలా చేస్తున్నావో లేదో నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటా' అని చెప్పారు. దీదీ అందరిముందు తన పొట్ట, బరువు గురించి మాట్లాడినా సురేశ్ మాత్రం అవమానంగా భావించలేదు. దీదీ సలహాను కచ్చితంగా ఆచరిస్తానని చెప్పాడు.
ఇదీ చదవండి: 'కశ్మీరీ పండిట్' టీచర్ను కాల్చి చంపిన ఉగ్రవాదులు