Mamata Benarjee Flight Issue: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం మధ్యలో భారీ కుదుపులకు గురికావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం.. శనివారం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్‌ను (డీజీసీఏ) నివేదిక అడిగింది. ఆమె ప్రయాణించే విమాన మార్గానికి ముందస్తు అనుమతి ఉందా? అనే విషయమై కూడా డీజీసీఏ నుంచి సమాచారం కోరింది. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన మమత శుక్రవారం సాయంత్రం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కాగా.. మధ్యలో భారీ కుదుపులకు గురైంది.
పైలట్ చాకచక్యంతో విమానం కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నప్పటికీ ఆమె వెన్నునొప్పికి గురైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశాన్ని ఓ డీజీసీఏ అధికారి వద్ద ప్రస్తావించగా.. దీనిపై నివేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి అన్ని ఘటనలపైనా దర్యాప్తు జరుపుతుంటామని, ప్రముఖులు ప్రయాణించే సందర్భాల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మమత ప్రయాణించిన 'దసో ఫాల్కాన్ 2000' 10.3 టన్నుల బరువుండే తేలికపాటి విమానం. దీనిలో ఇద్దరు విమాన సిబ్బంది సహా గరిష్ఠంగా 19 మంది ప్రయాణించొచ్చు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రి నారాయణ్‌ను 9 గంటలు విచారించిన మహారాష్ట్ర పోలీసులు