Ambedkar jayanti rally : మహారాష్ట్ర.. పాల్ఘర్ జిల్లాలోని కార్గిల్నగర్లో విషాదం నెలకొంది. కరెంట్ షాక్ వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు ర్యాలీలో గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వైరార్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం..
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా పాల్ఘర్ జిల్లా కార్గిల్నగర్ బౌద్ధజన్ పంచాయతీ సమితి ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఆ యాత్ర 10:30 నిమిషాలకు ముగిసింది. కగ్గిల్ చౌక్ నుంచి పాదయాత్ర ముగించుకుని కార్యకర్తలు ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో ఊరేగింపు వాహనంపై ఆరుగురు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో వాహనంపై ఉన్న కరెంట్ ఇనుప రాడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి ప్రమాదవశాత్తు ట్రాలీలో ఉన్న యువకులపై పడింది. దీంతో రూపేష్ సర్వే(30), సుమిత్ సుత్(23) ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలు కావడం వల్ల ముంబయిలోని కస్తూర్బా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని స్థానిక తహసీల్దార్ తెలిపారు. వీరందరూ అంబేడ్కర్ ఊరేగింపులో పాల్గొని తిరిగి వస్తుండగా ట్రాలీపై ఉన్న ఇనుప రాడ్ అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విరార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్ర దేశ్‌ముఖ్ చెప్పారు.
బైక్ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
ఉత్తర్ప్రదేశ్.. బులందర్షహర్ జిల్లాలో బైక్పై వెళ్తున్న ముగ్గురు స్నేహితులను ఓ కారు ఢీకొట్టింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడు భూపేంద్రను మేరఠ్ ఆస్పత్రికి తరలించారు. మృతులను భీమ్(28), సాధన(25)గా గుర్తించారు పోలీసులు. క్షతగాత్రుడు భూపేంద్ర బైక్ నడుపుతుండగా గంగేరువ ఫ్లైఓవర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
బస్సు బోల్తా.. 10 మంది భక్తులకు గాయాలు..
జమ్ముకశ్మీర్లో మాతా వైష్ణోదేవి ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు గాయపడ్డారు. జమ్మూలోని రియాసీ జిల్లాలో గురువారం జరిగిందీ ప్రమాదం. దిల్లీకి వెళ్తున్న క్రమంలో కత్రా శివారు ప్రాంతంలో యాత్రికుల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడిందని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ప్రమాదానికి డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడమే కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.