Maharashtra Bus Accident : మహారాష్ట్ర బస్సు ప్రమాద మృతులకు ఆదివారం సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు అధికారులు. మృతుల కుటుంబ సభ్యులను ఒప్పించి, ఇలా చేసినట్లు వారు వెల్లడించారు. ప్రమాదంలో బాధితుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ తరుణంలో డీఎన్ఏ పరీక్షలు చేసి, వాటి ఫలితాలు వచ్చే వరకు చాలా సమయం పడుతుందని అధికారులు వివరించారు. అందుకే సామూహిక అంత్యక్రియలకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ప్రమాద ఘటనలో మొత్తం 25 మంది చనిపోగా.. ఒకరి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మిగతా 24 మృతదేహాలకు సామూహికంగా అంత్యక్రియలు చేశామని వెల్లడించారు. బుల్దానాలోని శ్మశానవాటికలో ఈ కార్యక్రమం జరిగినట్లు అధికారులు తెలిపారు. శ్మశానవాటిక వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా వచ్చారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
మృతుల్లో 11 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో పది మంది వార్ధాకు చెందినవారని, ఏడుగురు పుణెకు, నలుగురు నాగ్‌పుర్‌కు, ఇద్దరు మాత్రం యవత్మాల్, వాషిమ్ ప్రాంతాలకు చెందిన వారని వివరించారు. ప్రమాద ఘటనలో డ్రైవర్, అతని సహాయకుడితో సహా మరో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు గానూ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రపోవడం వల్లే బస్సు అదుపు తప్పినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు.
మహారాష్ట్రలోని బుల్దానాలో జిల్లా పరిధిలోని సిండ్ఖేడ్రాజా ప్రాంతంలో సమృద్ధి మార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం వేకువజామున 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగ్‌పుర్ నుంచి పుణెకు 33 మందితో వెళ్తూ అదుపు తప్పింది. పక్కన ఉన్న స్తంభాన్ని, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారు గాయపడ్డారు. టైర్ పేలడం వల్లే ఇలా జరిగిందని తొలుత భావించినా.. అది కారణం కాదని అమరావతి ఆర్టీఓ నివేదిక ఇచ్చారు.
నిద్రలోనే సజీవదహనం..
Maharashtra Bus Tragedy : 25 మందిని బలిగొన్న బస్సు ప్రమాదంలో అతికొద్ది మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకోగలిగారు. అతికష్టం మీద బస్సు వెనుక అద్దం పగలగొట్టి, బయటపడినట్లు ఓ ప్రయాణికుడు చెప్పాడు. తనతోపాటు మరికొందరు మాత్రమే అలా చేయగలిగినట్లు వెల్లడించాడు. బస్సు టైరు పేలిన వెంటనే వాహనానికి మంటలు అంటుకున్నాయని.. క్షణాల్లోనే అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాపించాయని అతడు వివరించాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి