దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణాల్లో మొబైల్ ఫోన్ల ఉపయోగాన్ని నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ శుక్రవారం ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు తిరుచెందూర్‌లోని అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంలో సెల్‌ఫోన్‌ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ సీతారామన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను విచారించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
భక్తుల భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవాలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్లు వాడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు ఆదేశించారు. సెల్‌ఫోన్‌లు, కెమెరాల వినియోగం భక్తుల దృష్టిని మరల్చుతుందని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ జె.సత్యనారాయణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, గురువాయూర్‌లోని శ్రీకృష్ణ దేవాలయం, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలోనూ మొబైల్ ఫోన్లపై నిషేధం ఉన్నందున, తిరుచెందూర్ ఆలయంలో సైతం మొబైల్ ఫోన్లను నిషేధించాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో సరైన డ్రెస్ కోడ్‌ను అనుసరించాలని ధర్మాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.