Madhya Pradesh Election Result 2023 in Telugu : మధ్యప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారాన్ని నిలబెట్టుకుంది. అంచనాలకు మించిన ప్రదర్శనతో అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుంది. కౌంటింగ్ తొలి నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ ( MP Election Result 2023 ) మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. హస్తం, కమలం మధ్య హోరాహోరీ ఉంటుందని అంతా భావించినప్పటికీ- బీజేపీ డబుల్ఇంజిన్ పాలనకే ఓటర్లు జై కొట్టారు. కమలం పాలనను మెచ్చి మెజారిటీ కట్టబెట్టారు.
ఫలితం ఏకపక్షం
BJP Seats in Madhya Pradesh Election 2023 : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అయితే, హోరాహోరీ తప్పదని అంచనా వేశాయి. కానీ, తుది ఫలితం మాత్రం పూర్తి ఏకపక్షంగా వచ్చింది. కాంగ్రెస్‌ను చిత్తు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది.
పేద మహిళల అండతో!
2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా- జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీలో కలిశారు. దీంతో 2020లో రాష్ట్రంలో డబుల్ఇంజిన్ సర్కారు కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకునే అనేక పథకాలు తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 1.3 కోట్ల మంది పేద మహిళలకు నగదు అందించే 'లాడ్లీ బహ్నా యోజన' పథకం ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా మారింది.
దీంతో పాటు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్. అంగన్వాడీ కార్మికులకు వేతనాలను రూ.10వేల నుంచి రూ.13 వేలకు పెంచుతామని ప్రకటించారు. రూ.9వేలుగా ఉన్న గ్రామ సహాయకుల వేతనాన్ని మూడు రెట్లు పెంచి రూ.18వేలకు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇచ్చే గౌరవవేతనాన్ని మూడు రెట్లు చేస్తామని చెప్పారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఈ-స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవి బీజేపీకి కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
మోదీ ఇమేజ్- డబుల్ఇంజిన్ సూపర్ హిట్!
రాష్ట్ర నాయకత్వం విషయంలో అనిశ్చితి నెలకొన్నా ఎన్నికల్లో డబుల్ఇంజిన్ వ్యూహంతో ముందుకుసాగింది కాషాయదళం. బీజేపీ అధినాయకత్వం మధ్యప్రదేశ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి 15 రోజుల ముందే 15 ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. మోదీకి ఉన్న జనాకర్షణ ఎన్నికల్లో బాగా పనిచేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీజేపీ అభివృద్ధి అజెండా సైతం సానుకూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ప్రచార వ్యూహం
శివరాజ్ సింగ్‌కు తోడుగా వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ వంటి నేతలు తరచుగా మధ్యప్రదేశ్ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. బుందేల్‌ఖండ్‌లో శివరాజ్‌తో పాటు ఈ నేతల్లో ఒక్కరైనా ఎన్నికల సభలకు హాజరయ్యారు.
కేంద్ర మంత్రుల పోటీ
శివరాజ్‌సింగ్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీ. ఆయన్ను పక్కనబెడుతున్నామనే సంకేతాలిస్తూ కేంద్ర మంత్రులను, ముఖ్యనేతలను రంగంలోకి దించింది. సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. శివరాజ్‌పై ఉన్న వ్యతిరేకత పార్టీపై పడకుండా ఈ వ్యూహం ఫలించినట్లు కనిపిస్తోంది!
హిందుత్వ కార్డ్- బెడిసికొట్టిన కాంగ్రెస్ వ్యూహం
హిందుత్వ అంశం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. హిందూ ఓట్లను సమీకరించేందుకు తన వైఖరికి భిన్నంగా కాంగ్రెస్ అనుసరించిన సాఫ్ట్ హిందుత్వ వైఖరి బెడిసికొట్టింది. మరోవైపు హిందుత్వ కార్డును బీజేపీ పక్కాగా ప్రయోగించింది. ఎన్నికలకు నెలల ముందు నుంచే హిందూ ఆలయాల అభివృద్ధిపై శివరాజ్ సర్కారు దృష్టిసారించింది. చిత్రకూట్, సల్కాన్పుర్, రామ్లోక్, సాగర్ జిల్లాల్లో నాలుగు ఆలయాల అభివృద్ధికి హామీ ఇచ్చింది. సాగర్‌లో రూ.100 కోట్లతో నిర్మించే రవిదాస్ ఆలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఆగస్టులో భూమిపూజ చేశారు. ఛింద్వాడాలో పాత హనుమాన్ ఆలయ పునర్నిర్మాన పనులకు సీఎం శివరాజ్ రూ.350 కోట్లు ప్రకటించారు. దీంతో పాటు సంస్థాగతంగా రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం ఎన్నికల్లో మేలు చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ మేజిక్- కాంగ్రెస్‌కు బిగ్ షాక్! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు!!
బీజేపీలో నయా జోష్- డ్యాన్సులతో హోరెత్తిస్తున్న లేడీస్- ఈమె నృత్యం హైలైట్!