Lokesh Comments on Chandrababu Skill Case: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈరోజు దిల్లీలో నారా లోకేశ్ దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఇష్టాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై స్పందించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయాల్లో భాగమని భావించడం లేదని.. అలాగైతే రాజకీయాల్లో నిజాయతీగా ఎందుకు పనిచేయాలన్న ప్రశ్న ఉదయిస్తుందన్నారు. జగన్ లాగా లక్ష కోట్లు తిని ఉంటే బాధుండదని విమర్శించారు. చేయని తప్పునకు తండ్రిని జైల్లో పెడితే ఏ కొడుక్కైనా బాధ ఉంటుందని అన్నారు.
నీతి, నిబద్ధతతో 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు అని.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తికి న్యాయం జరగడంలో జాప్యం అవుతోందనడానికి సందేహించన్నారు. పౌరుడిగా ఇది తన అభిప్రాయమని లోకేశ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిందని.. సిద్ధమవడానికి కొంత సమయం పడుతుందన్నారు. పరిగెత్తడం మొదలుపెట్టాక ఆపడం ఎవరి తరమూ కాదని మండిపడ్డారు. పార్టీ ఇప్పుడు పరుగెత్తే స్థితికి చేరిందని.. అడ్డువచ్చిన వారిని తొక్కుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శమని.. 23 రోజులుగా అధినేతను చూడకపోయినా క్షేత్రస్థాయిలో కేడర్ క్రియాశీలకంగా పనిచేస్తోందన్నారు.
చేయని తప్పునకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదని భావించి, ఈ వ్యవస్థను మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు లోకేశ్ తెలిపారు. స్టాన్‌ఫోర్డ్‌లో చేరడానికి వ్యాసం రాయమన్నప్పుడు రాజకీయాల్లో సానుకూల నాయకత్వం తీసుకురావాలని అనుకుంటున్నానని రాసినట్లు వెల్లడించారు. నిజాయతీపరులకు శిక్ష పడితే చదువుకున్నవాళ్లు, సామాజిక స్పృహ ఉన్నవారు రాజకీయాల్లోకి రారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Break For yuvgalam with CID Cases : యువగళం జోరందుకున్న వేళ.. 'సీఐడీ స్కిల్' కేసులతో సర్కారు అస్త్రం
బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై లోకేశ్: రాజకీయాల్లోకి రావడం అది బ్రాహ్మణి ఇష్టమన్న లోకేశ్.. తామిమిద్దరం స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీయే చేశామన్నారు. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును చూసి షాకైనట్లు చెప్పారు. నిజాయతీగా పనిచేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారా అనిపించిందన్నారు. హెరిటేజ్ వ్యాపార వృద్ధికి తాము తీసుకొనే ఎన్నో నిర్ణయాలకు ఆయన బ్రేక్‌లు వేశారని.. చెడ్డ పేరు వస్తుందేమోనని వద్దన్నారని చెప్పారు. చంద్రబాబు కారణంగానే హెరిటేజ్ గ్రోత్ నిదానంగా జరిగిందని లోకేశ్ తెలిపారు. లేదంటే ఇప్పటికే మూడురెట్లు పెరిగేదని.. హెరిటేజ్ మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వృద్ధి చెందింది తప్ప, అధికారంలో ఉన్నప్పుడు కాదన్నారు. తమకు ఐటీ కంపెనీల్లేవని సైబరాబాద్‌లో ఎకరం భూమి కూడా లేదని లోకేశ్ స్పష్టం చేశారు.
సెక్షన్ 17-A కింద మాజీ మంత్రిని డీజీపీ స్థాయి ర్యాంకు అధికారి తప్ప ఏఎస్పీ పిలవడానికి వీల్లేదని లోకేశ్ స్పష్టం చేశారు. తన విషయంలో సీఐడీ నిబంధనలు పాటించలేదని.. సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిలిచింది కాబట్టి.. దానిపైనే విచారించాలని అక్కడికెళ్లాక ఇది కాదు ఇంకో కేసులో విచారిస్తామంటే కుదరదన్నారు. వారు చెబుతున్న ఏ కేసుతోనూ తనకు సంబంధం లేదని లోకేశ్ తేల్చిచెప్పారు. తానెప్పుడూ హెరిటేజ్ పాలక మండలిలో లేనని.. దాని ఖాతా పుస్తకాలు, వ్యవహారాలు తన దగ్గర ఉండవని చెప్పారు. సీఐడీ నోటీసులో పేర్కొన్న వివరాలు ఇవ్వాలంటూ హెరిటేజ్ కార్యదర్శికి మెయిల్ పంపారని.. ఆ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు లోకేశ్ తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఐఏఎస్‌లు చెప్పినా, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించాలని.. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదని లోకేశ్ అన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో చెప్పామని.. గుజరాత్‌లో విజయవంతంగా అమలైంది కాబట్టి ఇక్కడ ఒకేసారి అమలు చేశామని లోకేశ్ స్పష్టం చేశారు. ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, 34 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి, 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకొందని.. ఇందులో తప్పు జరిగిందని భావిస్తే అధికారులను విచారించాలి తప్ప, సీఎంను కాదన్నారు.
ఈ ప్రాజెక్టు అమలుకు 285 కోట్లు విడుదల చేయాలి.. సీమెన్స్, డిజైన్ టెక్ ప్రయోజనాలు కాపాడాలని.. ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి చెప్పారన్నారు. తర్వాత ప్రాజెక్టు పర్యవేక్షణకు రెండు కమిటీలు వేశామన్నాని లోకేశ్ తెలిపారు. డబ్బులు తినాలనుకుంటే ఇన్ని కమిటీలు వేస్తారా అని ప్రశ్నించారు. షెల్ కంపెనీల ద్వారా తమకు డబ్బులొచ్చినట్లు ఆధారాలు చూపాలని లోకేశ్ సవాల్ చేశారు. తాము 8 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నామని.. అంతకంటే రూపాయి ఎక్కువున్నా రాసిస్తామన్నారు. స్కిల్ కేసులో సీఐడీయే కథ అల్లేసి, నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు వహిస్తోందని దుయ్యబట్టారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, హక్కులను హరించి, సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని చెప్పడం న్యాయమా అని లోకేశ్ అని నిలదీశారు.
Lokesh Delhi Tour: దిల్లీకి నారా లోకేశ్.. జాతీయ మీడియా దృష్టికి చంద్రబాబు అరెస్ట్ అంశం
స్కిల్ కేసు, జగన్ అక్రమాస్తుల కేసులు పూర్తి భిన్నమని.. జగన్ కేసుల్లో ప్రతి ఆరోపణకూ ఆధారాలున్నాయని లోకేశ్ తెలిపారు. ఒక వ్యక్తి నాటి సీఎం వైఎస్‌ను కలిశాక వారికి అనుకూలంగా జీవోలు ఇచ్చారని.. వెంటనే వారు జగన్ కంపెనీల్లో షేర్లు కొన్నారన్నారు. డబ్బులు బదిలీ అయ్యాయని వాటికి సాక్ష్యాధారాలున్నాయని స్పష్టం చేశారు. స్కిల్ కేసులో అలాంటి రుజువులున్నాయా అని ప్రశ్నించారు. పైగా స్కిల్ కేసులో ఫోరెన్సిక్ ఆడిట్ విధివిధానాలు ఎందుకు మార్చారని.. క్షేత్రస్థాయిలో భౌతిక పరిశీలన ఎందుకు చేయించలేదని లోకేశ్ ప్రశ్నించారు. జగన్ కంపెనీలకు ఆడిట్ చేసిన కంపెనీయే ఈ ప్రాజెక్టు ఆడిట్ ఎలా చేసిందన్నారు. రెండూ ఒకే ఐపీ అడ్రస్ ఎలా పంచుకున్నాయని.. ఈ కేసు 2018లోనే మొదలైందనడానికి ఎఫ్‌ఐఆర్ ఉందా అని లోకేశ్ నిలదీశారు. ఎఫ్‌ఐర్ 2021లో నమోదైనందున దీనికి 17ఎ వర్తిస్తుందన్నారు.
సాక్ష్యాధారాలు లేకుండా కేసులు పెడితే ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రినీ జైళ్లకు పంపొచ్చని లోకేశ్ అన్నారు. తన వద్దకు వచ్చిన వినతి పత్రంపై పరిశీలించండి అని రాస్తే దాన్ని రెకమెండేషన్‌గా భావించి జైలుకు పంపొచ్చని ఈ ఉదంతం చెబుతోందని లోకేశ్ ఆరోపించారు. తాను మంత్రిగా 2వేల ఫైళ్లు క్లియర్ చేశానని.. ఒక్కో ఫైల్ క్లియరెన్స్‌కు సగటున 55 నిమిషాలు పట్టిందన్నారు. అంతవేగంగా పనిచేయడం తప్పని, 55 రోజులు తీసుకుంటే మేలేమోనని ఇప్పుడనిపిస్తోందని లోకేశ్ అన్నారు.
టీసీఎల్ కంపెనీతో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఒక్క లంచ్ మీట్‌లో ఖరారు చేశామని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలను తప్పుబడితే కక్షలకు అంతం ఉండదని లోకేశ్ స్పష్టం చేశారు. అందుకే ఈ నాలుగున్నరేళ్లలో ఏపీకి ఒక్క కంపెనీ రాలేదని.. అయితే, చంద్రబాబు అరెస్ట్‌లో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులందరిపై తాము న్యాయ విచారణ జరిపిస్తామని లోకేశ్ తేల్చిచెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ వెనుక ఫలానా వారి హస్తం ఉందని ఇతర నాయకుల్లా ఆరోపించనని లోకేశ్ పేర్కొన్నారు. జగన్ లండన్‌లో రాహుల్ గాంధీని కలిశారన్న వదంతులున్నాయని.. ఇలాంటి ఊహాగానాలపై మాట్లాడలేనని తేల్చిచెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ లబ్ధి పొందిందా లేదా అన్నది 2024 ఎన్నికల ఫలితాలు చెబుతాయని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తున్నామని.. చంద్రబాబును కలిసిన ఐదు నిమిషాల్లోనే పవన్ కల్యాణ్ దీనిపై నిర్ణయం తీసుకున్నారని లోకేశ్ చేప్పారు. 3వ తేదీ తర్వాత ఇరు పార్టీలతో సమన్వయ కమిటీ వేస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎంలతో కలిసి పనిచేయడంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు. తాము ఎన్డీయే, ఇండియా కూటముల్లో లేమని స్పష్టం చేశారు.
జగన్‌లా తాము రాజకీయాలు చేయలేదని కోడికత్తి, బాబాయ్ హత్య కేసుల్లో నిందితులెవరో తెలుసన్నారు. ఒకే కులం వారికి డీఎస్పీలుగా పదోన్నతులు వంటి అబద్ధాలను దిల్లీ వరకూ ప్రచారం చేశారని లోకేశ్ విమర్శించారు. వాటిని తాము సమర్థంగా ఖండించలేకపోయామని.. వీటిలో నిజాలు తెలిసినందునే ప్రజలు ఈ సైకో పోవాలంటున్నారన్నారు.
మోతమోగాలికి వచ్చిన స్పందన అందులో భాగమే అన్నారు. సాక్షి, భారతీ సిమెంట్‌పై కక్ష సాధింపులకు సీఐడీని వాడుకోలేదన్నారు. వైసీపీ తీరుతో ఏపీ దక్షిణ భారతదేశ బిహార్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తప్ప, ఆ పార్టీలోని వారంతా చంద్రబాబు అరెస్టును తప్పు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న విలేకర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మీడియా బాధితురాలిగా మిగిలిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జగన్ అహంకారంలో మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఒకేలా ఉన్నారని పేర్కొన్నారు.
ఓ పక్క కేసులు ఎదుర్కొంటూనే ఓటర్ల జాబితాపై నిఘా పెట్టామని లోకేశ్ చెప్పారు. తాను ఈ పరిస్థితుల్లో వాటిపై స్పందిస్తే ప్రజలు, మీడియా తప్పు పడతారన్నారు. చంద్రబాబు బయటికొచ్చాక యువగళం ప్రారంభిస్తామని తెలిపారు. మిగిలిన విషయాలు రాజకీయ యాక్షన్ కమిటీ చూసుకుంటుందని వెల్లడించారు. పార్టీలోనూ సంస్కరణలు తీసుకువస్తామని.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను రెండుసార్లు మాత్రమే పనిచేయాలని తెలిపారు. తర్వాత పైపదవికైనా వెళ్లాలి, కింది కన్నా రావాలన్నారు. లేదంటే ఒక దఫా విరామం తీసుకోవాలని తెలిపారు. దీన్ని తానూ పాటిస్తానని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి తగిన న్యాయం చేస్తుందనడానికి మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ఉదాహరణలు అన్నారు.