దిల్లీ ప్రభుత్వ పథకాలపై ఆప్, భాజపా మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా ఆప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న ఉచిత విద్యుత్ పథకంపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు.
ఈ పథకం కింద విద్యుత్ సరఫరా చేసే ప్రైవేటు సంస్థలకు దిల్లీ చేస్తోన్న చెల్లింపులకు సంబంధించిన విషయంలో ఈ విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే.. మూడు నెలల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ ప్రభుత్వపు మద్యం విధానంలో సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యుత్ పథకం వచ్చి చేరింది. ఇప్పటికే ఈ మద్యం విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ కేసులో పేర్కొన్న నిందితుల్లో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, ప్రస్తుతం ఎల్‌జీ తీసుకున్న నిర్ణయంపై కేజ్రీవాల్ స్పందించారు. 'ఆప్ ఉచిత విద్యుత్ హామీ గుజరాత్ ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకే దిల్లీలో ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపివేయాలని భాజపా ప్రయత్నిస్తోంది. దిల్లీ ప్రజలారా.. నన్ను నమ్మండి. ఈ పథకాన్ని నేను ఆగనివ్వను. గుజరాత్ ప్రజలారా.. నన్ను నమ్మండి. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. మార్చి ఒకటి నుంచి మీకు ఉచిత విద్యుత్ అందుతుంది' అని స్పష్టం చేశారు. గుజరాత్‌లో రెండు దశాబ్దాలుగా భాజపానే అధికారంలో ఉంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో.. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ విజయం దక్కించుకోవాలని ఆప్ విస్తృత ప్రచారం చేస్తోంది.
ఇదీ చదవండి: పెళ్లింట పెను విషాదం.. బస్సు నదిలో పడి 25 మంది మృతి
విషమంగానే ములాయం ఆరోగ్యం.. ఆస్పత్రికి కుటుంబ సభ్యులు.. అఖిలేశ్‌కు యోగి ఫోన్