Legal Battle in Courts in Chandrababu Cases : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఏపీ కేంద్రబిందువుగా నిలిచింది. చంద్రబాబుకు నిర్బంధానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం శ్రేణులు ఆందోళనలు, దీక్షలు చేపట్టగా.. దేశ, విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు బాబుకు మద్దతు చాటుతున్నారు. మరోవైపు కోర్టుల్లో న్యాయపోరాటం కొనసాగిస్తున్న తరుణంలో రోజవారీగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. నిరాధారమైన కేసును కొట్టివేయడంతో పాటు బెయిల్ లక్ష్యంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు పోరాటం కొనసాగిస్తుండగా.. రోజుకో కొత్త కేసును సీఐడీ తెరపైకి తెస్తోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైలుకే పరిమితం చేయాలన్న లక్ష్యంతో సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులు తెరపైకి వచ్చినట్లు న్యాయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో 19రోజులుగా కోర్టుల్లో వాద, ప్రతివాదనలు ఆసక్తి గొల్పుతున్నాయి. ఓ వైపు ఏసీబీ కోర్టు, మరో వైపు హై కోర్టు, ఇంకో వైపు సుప్రీం కోర్టు.. విజయవాడ మొదలుకుని దిల్లీ దాకా ఆయా కోర్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ 37గా చంద్రబాబు పేరు చేర్చిన సీఐడీ.. ఈ నెల 8న నంద్యాలలో ఆయన్ను అరెస్టు చేసింది. ఆ వెంటనే విజయవాడ ఏసీబీ కోర్టు... 14రోజులు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, కేసుతో తనకు సంబంధం లేదంటూ.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. కేసు అక్రమమంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను గత శుక్రవారం హైకోర్టు కూడా తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయడంతో పాటు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ.. సోమవారం చంద్రబాబు తరఫు సిద్ధార్థ లూథ్రా సీజేఐ వద్ద మెన్షన్ చేశారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటీషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Chandrababu to CID custody : స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ కస్టడీకి చంద్రబాబు
విజయవాడ ఏసీబీ కోర్టులో... సీఐడీ అరెస్టు అనంతంర చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. గడువు ముగిసిన తర్వాత మరో రెండు రోజులు రిమాండ్ పొడిగించింది. రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించింది. కస్టడీ ముగిసిన తర్వాత 12రోజులు రిమాండ్ పొడిగించగా.. ఐదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. ఇదే సమయంలో మరో రెండు కేసులు తెరపైకి రావడంతో.. చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు, సుప్రీం గడపను తొక్కారు.
ఈ క్రమంలో ఇవాళ చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే, చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది. అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై అదే రోజు విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామన్న కోర్టు.. వాదనలు విన్న తర్వాత ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.
హైకోర్టులో... చంద్రబాబు క్వాష్ పిటిషన్ సస్పెండ్ చేసిన హైకోర్టు.. బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. ఇదే సమయంలో రింగురోడ్డు కేసులో సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా.. కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.
సుప్రీంకోర్టులో... చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జరిగిన విచారణ అక్టోబర్ మూడో తేదీకి వాయిదా పడింది. మొదట ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విముఖత చూపారు. ఆ వెంటనే చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. సీజేఐ ముందు మెన్షన్ చేస్తూ.. . తక్షణమే లిస్టింగ్ చేయాలని కోరారు. త్వరగా లిస్ట్ చేయాలన్నది తమ మొదటి అభ్యర్థన అని, మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్థన అని సిద్ధార్థ లూథ్రా వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సీఐడీ ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలోకి తీసుకోకూడదని వెల్లడించిన సిద్ధార్థ్ లూథ్రా... ఈ కేసులో తాము బెయిల్ కోరుకోవడం లేదన్నారు. జడ్ క్యాటగిరీ, ఎన్ఎస్జీ భద్రత కలిగిన వ్యక్తి పట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ యశ్వంత్ సిన్హా కేసును ప్రస్తావించారు. ఈ క్రమంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది.