ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో(Up Shahjahanpur) దారుణం జరిగింది. జిల్లా కోర్టు ప్రాంగణంలో(Lawyer Killed In Shahjahanpur) ఓ న్యాయవాదిని మరో న్యాయవాది తుపాకీతో కాల్చి చంపాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పాత కక్షలే హత్యకు కారణం అని అధికారులు తెలిపారు. ఘటనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున నలుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
"న్యాయవాది సురేశ్ గుప్తాకు వ్యతిరేకంగా బాధితుడు, న్యాయవాది భూపేంద్ర సింగ్(58).. డజనుకుపైగా కేసులు నమోదు చేశాడు. భూపేంద్రపై కక్షతో.. సురేశ్ గుప్తా ఈ దారుణానికి పాల్పడ్డాడు. కోర్టు ప్రాంగణంలోనే ఈ హత్య జరగడం వల్ల ఓ ఇన్స్పెక్టర్ సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాం."
-సంజయ్ కుమార్, షాజహాన్‌పుర్ ఏఎస్పీ
"జలాలాబాద్ తాలుకాకు చెందిన న్యాయవాది భూపేంద్ర సింగ్.. ఓ క్లర్కును కలిసేందుకు షాజహాన్‌పూర్‌లోని జిల్లా కోర్టు మూడో అంతస్తులోకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు" అని ఎస్పీ ఎస్ ఆనంద్ తెలిపారు. మృతదేహం వద్ద ఓ తుపాకీ కనిపించిందని పేర్కొన్నారు.
న్యాయవాది సురేశ్ గుప్తా, అతని ఇద్దరు కుమారులు గౌరవ్ గుప్తా, అంకిత్ గుప్తాపై కేసు(Lawyer Killed In Shahjahanpur) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సురేశ్ గుప్తాను అరెస్టు చేసినట్లు చెప్పారు.
విపక్షాల విమర్శలు..
మరోవైపు.. న్యాయవాది హత్య జరిగాక.. జిల్లాలోని న్యాయవాదులంతా సమ్మె చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఖండించాయి. ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించాయి.
"పగటిపూట న్యాయవాది హత్య జరగడం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలు, రైతులు, న్యాయవాదులు సహా ఎవరికీ భద్రత లేదు అనేందుకు నిదర్శనం" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు.
"సులభంగా నేరాలకు పాల్పడటంలో ఉత్తర్‌ప్రదేశ్.. దేశంలోనే నంబర్ వన్‌గా మారింది"అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు.
"ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే గొప్పలకు ఈ ఘటన నిదర్శనం"అని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు.
ఇదీ చూడండి: హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు