Bipin Rawats brother joins BJP: ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ భాజపాలో చేరారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకొన్నారు. సైన్యంలో కర్నల్‌గా విధుల నిర్వహించి పదవీ విరమణ చేసిన విజయ్ రావత్.. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత నచ్చే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయని భాజపా వర్గాలు తెలిపాయి.
మాజీ సైన్యాధికారి అయిన తన తండ్రికి కూడా భాజపాతో అనుబంధం ఉందని పార్టీలో చేరిన అనంతరం తెలిపారు విజయ్ రావత్. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, ఆలోచనా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేశాభివృద్ధి కోసం ఆయన వినూత్న పంథాను అనుసరిస్తారు." అని విజయ్ రావత్ పేర్కొన్నారు.
రావత్‌ను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన కుటుంబం మూడు తరాలుగా సైన్యంలో సేవలందిస్తోందని కొనియాడారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. జాతీయవాద భావజాలమే భాజపాకు స్ఫూర్తి అని, భద్రతా సిబ్బంది సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. సీడీఎస్ బిపిన్ రావత్ కూడా రిటైర్ అయ్యాక రాష్ట్రం కోసం సేవలు అందించాలని కోరుకున్నారని చెప్పారు. విజయ్ రావత్ రాకతో భాజపా మరింత బలోపేతం అవుతుందన్నారు.
ఇదీ చదవండి: మాయావతి 'నామమాత్రపు' పోటీ- మరి దళితుల మద్దతు ఎవరికి?